మా యింటి ఎనకాల చిక్కుడు చెట్టు


మా యింటి ఎనకాల చిక్కుడు చెట్టు

మా అన్న కి నాకు యిపరితమైన చెట్ల పిచ్చి, ఏందో చిన్నప్పటి సంధి మా ఇంటెనకాల ఎన్ని మొక్కలు పాతి పెట్టిన ఒక్కటి కూడా ఏరందుకోలే. ఏడికెల్లి పట్టుకొంచ్చిండో ఏందో రెండు వేప మొక్కలు. హన్మకొండ అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరికీ హన్మకొండ అంటే పెద్ద సిటీ. పేరుకు మాత్రమే మేము పట్నాపోల్లమే గాని కూటికి తిప్పలు పడే గరీబోల్ల లిస్టు లో మా ఇల్లు ఫస్టు.

ఇక మా గల్లిల ఉన్నోల్లందరికీ ఎండా కాలం వచ్చిందంటే చేరుగట్టు కాడుండే రావిచెర్ల బావి తర్వాత మా బావి నీళ్ళే దిక్కు. 

ఆ భావికి ఇవుతల వేప మొక్కలు తేవడమే తరువాయి ఆ మూల ఈ మూల దబ దబ మట్టి దవ్వి వేప మొక్కలు నాటితిమి, పొద్దున లేచిన సంధి దుప్పటి కప్పెసుకునేంత వరకు ఎప్పుడు వీలైతే అప్పుడు చెంబుల కొద్ది నీళ్ళు పోస్తుంటే. ఓ పోలగాల్లర మొక్కలు మురిగిపోతాయ్ బిడ్డ అని మా బాపమ్మ చెప్పిన కూడా ఇనకుండా పోయడంతో ఆమె అన్నట్టుగానే ఓ మొక్క చనిపోవడం. చనిపోవడంతో ఇక మేము జాగ్రత్త పడడం ఎంటనే జరిగిపోయనాయీ..

ఇక ఉన్న మొక్కని చాల జాగ్రత్తగ  పెంచడం తో చూస్తుండగానే నిక్కర్లు తొడుక్కునే నాకన్నా మూడు నాలుగు ఐదింతలు పెరిగింది. 
నా పిడికిలంత లావుండే దాని కాండం మెల్ల మెల్లగా రెండు చేతులతో కావలించుకునేంత లావయ్యింది. 
మా గల్లిలో ఎవలికి తల్లైన మా ఇంటి వేప కొమ్మలే, ఎవరికీ జ్వరమొచ్చిన జిష్టి తీసుకునేందుకు మా వేప కొమ్మలే, పోచమ్మలు చేసుకున్న, బోనాలు ఎత్తుకున్న, ఇలా  పండగలకి పబ్బాలకి మా యాపే చెట్టే దిక్కు.
గల్లిలల్ల ఉండే ధర్వాజలన్ని మావిడాకులతో పాటు ఆ కొస ఈ కొస వేలాడ దీసే యాప కొమ్మలను చూపెడుతూ  మా ఇంట్ల తెంపి ఇచ్చినవే అని గర్వంగే చెప్పుకునేటొన్ని మా దోస్తులతో. 

మా కులంలో ఊగాది పచ్చడి చేసుకుంటుంటే కుండ పలిగిందని, మళ్లీ మా కులంలో ఉగాది పచ్చడి చేసుకుంటే అరిష్టం అనే పుకారు నేను పుట్టకముందు నుండే ఉండే సరికి నేను కూడా ఆ పుకారుకి అలవాటు పడిపోయాను, ఇక మా ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకోమని తెలిసి మా ఇంటి వేప కాయాలు తేమ్పుకున్నోల్లు తేమ్పుకోనోల్లు అందరు చెంబులకోద్ధి(మా వరంగల్ లో పచ్చడి చారు లాగ పలుచగా చేస్తుంటారు అందుకే చెంబులల్లో పట్టుకొచ్చేటొల్లు)  ఉగాది పచ్చడి. 

ఇక ఎవరిచ్చారో ఏంటో నాలుగు చిక్కుడు గింజలు పొట్లం కట్టుకొని మా బాపు పట్టుకోచ్చిండు. ఇక మా అన్నా ఆగనే లే వెంటనే మట్టి తవ్వి సిద్ధం చేస్తే మా అమ్మ మనసులో దేవుడికి  దన్నం పెట్టుకొని మంచిగ పెరగాల అనుకుంటూ తవ్విన చోట్ల అక్కడక్కడ గింజలు నాటింది. 

ఇక పెట్టినకాన్నుండి  పొద్దున లేచిన వెంటనే నేను మా అన్నయ మా అక్కయ నేను ఒకటే సూసుడు ఎప్పుడు మొలుస్తుందా అని. 

ఆ రోజు రాత్రి వర్షాకాలానికి స్వాగతం చెప్తూ చిన్న తుంపర్లతో మొదలై చక్కని జల్లు కురిసింది.
మాధీ పెంకుటిల్లు మేమేసుకున్న పక్క లు తడవకుండా పెంకు రంధ్రల్లోనుండి కురుస్తున్న నీటి చుక్కలు పడుతున్న చోటులో  గిన్నెలు తపాలలు పెడుతుండేది మా అమ్మ. నేను ఇంటి బయట ధర్వాజకు ఒక్క రిక్క తలుపు ఉండేది దాని  గొళ్ళెం తీసి చీకటి నిశ్శబ్దం లో కమ్మగా వినిపించే వర్షపు రాగాన్ని వింటూ గూన పెంకు వాలు నుండి ధారగా పడుతున్న నీటి వరుసుల్ని దీపం వెలుతుర్లో చూస్తూ, అప్పుడప్పుడు మెరిసే మెరుపు ఉరుములకి ఉలిక్కి పడుతూ తీయని మట్టి సువాసనలు ఆస్వాదిస్తూ అల ఎప్పుడు పడుకునే వాన్నో.... తెల్లారి లేచి చూస్తే మాత్రం దుప్పటి ముసుగులో ఉండేవాన్ని (దాదాపు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇలా వర్షం చూస్తూ నిద్ర పోవడం అమ్మ ఎత్తుకొచ్చి పక్కలో పడుకోబెట్టి దుప్పటి కప్పడం సర్వ సాధారణం).

వర్షం కురిసి వెలిచిన ఇంకా ఆ ఆనవాలు మిగిలే ఉండేది ఇంటెనక మట్టి నేల మీద తడి రూపంలో. తడి ఆరలేదు ఇంకా చిత్తడి గానే ఉంది.
కాళ్ళు తుడుచుకునేందుకు దర్వాజా బయట  ఓ గోనే సంచి వేసేది. కాళ్ళతో మట్టి లోపలి రాకుండా. ఇక గాలి వీచినప్పుడల్లా దాచిపెట్టుకున్న నీటి బొట్లని వేప కొమ్మల్లో ఉన్న ప్రతి ఆకు నా పై గురిచూసుకొని మరి విసిరేవి. పడుతున్న పెద్ద పెద్ద చినుకులని తప్పించుకుంటూ అల అడుగులో అడుగు వేసుకుంటూ గింజ నాటిన  చోటుకి వెళ్లి చూసా....

"మెడలు వంచి సిగ్గుతో అల్లాడిపోతున్న ఓ నగ్న యువతీల ఎంతో సున్నిత సుకుమారంగా నేలలోనుంచి పురుడు పోసుకుంది... మా చిక్కుడు మొక్క. 
అంతే........ నా ఆనందానికి అవధుల్లు లేవు. ఒక్క పరుగున వెళ్లి "అమ్మ మొక్క మొలిచింది రా సూడు".. అని చేయి పట్టుకొని లాక్కొచ్చాను అమ్మని. 
నా మాటకి కట్టగట్టుకొని అందరం. ఆకరికి భారికాయమేసుకున్న మా బాపమ్మ కూడా ఉ. ఉ. అని మూలుగుతూ రైక సరి చేసుకుంటూ కొంగు మిదేసుకుని మరి వచ్చి చూసింది. ఇక మా అమ్మ మంచిగా పెరగాలని దీవిస్తూఆ మొక్క చుట్టూ మట్టి తో అద్దులు పెట్టి సరిచేసింది.

ఇగో మొక్కని  ఊకే చూడొద్దు జిష్టి తకుతది అని చెప్పే సరికి ఇక కొద్ది రోజుల వరకు పట్టించులేదు నేను. ఇక మా అమ్మ నే రీలు దారం ఆ తర్వాత సుతిలు దారం ఉపయోగించి ఎట్టో గట్ల మా పయకాన రేకు మీదికి తీగను పారిచ్చింది. ఆ తీగ ఎప్పుడందుకుందో ఏమో  మా యాప చెట్టుని. నేను సుస్తుండగానే మంచి లవ్వు పుట్టి యాప కొమ్మలకి అల్లుకుంది, ఈ చిక్కుడు తీగ.

ఇక కిక్కురుమనకుండా పెరుగుతున్న యాప చెట్టూ చిక్కుడు చెట్టూ నాకు మంచి దోస్తులు. ఏదో సీరియల్ లో చూపించినట్టు నేను కూడా ఎవలికి చెప్పుకోలేని మాటలన్నీ ఈ చెట్లకే చెప్పుకునే టొన్ని.
అవి నాకు మంచి దోస్తులవడమో లేక వాటికి మాటలు రాకపోవడమో ఏమోగాని నేను చెప్పిన మాటల్ని ఎవరికీ చెప్పకుండా యాప చెట్టూ తన కాండం కడుపులో, చిక్కుడు తన సొగసరి తీగ మనసులో దాచుకునేది. అవే గనక నాకు శాత్రువులయ్యింటే అప్పుడు మా ఇంట్లో నా  ఇజ్జత్ మొత్తం పోయేటిది.

ఎన్నెన్ని చెప్పుకుంటోన్నో నొక్కేసినా చాకుపీసు ముక్కలు, 
దోరికిపోయినందుకు టీచర్ వాయిపంపులు, 
ఇంగ్లీషు టీచర్ పై నేను పెంచుకున్న ఇష్టం (అబ్బో ఆ కథే వేరు ఇప్పటికి ఒళ్ళు పులకరిస్తుంటుంది ఆ రోజులు గుర్తొస్తే), 
దొంగ తనంగ సైకిల్ తొక్కుతూ పైకి కనపడకుండా ఎన్ని దెబ్బలు తగిలించుకున్ననో, 
ఎవరెవరు నన్ను హేళన చేసారో, 
ఎవరెవరికి అబద్ధం చెప్పానో, 
రూపాయి రెండ్రుపాయలు తీసుకొని మా క్లాస్స్ పిలగండ్లందరి  నోటుబుక్కు ముందు పేజీల్లో వారి పేర్లు గీసిచ్చనో, 
మా అన్నకి తెలీకుండా తన వైట్ నోటు బుక్ లో ఎన్ని జంట కమ్మలను చింపుకున్ననో... ఇంకా ఎన్నో మా దోస్తు ఆరిఫ్ గానికి కూడా చెప్పుకోలేక ఈ చిక్కుడు చెట్టూ పందిరి కింద కాసేపు, వేప చెట్టూ మొదలుకు సంచి పరుచుకొని వొరిగి మరి చూచి రాతలు రాసుకుంటూ కాసేపు చెప్పుకునే టోన్ని.  
వామ్మో ఇన్నేసి సంగతులో ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇజ్జాత్ మొత్తం పోయేటిది అందుకే ఈ రెండు చెట్లంటే నాకు మస్తు ఇష్టం.

వాకిలి ఊడ్చి చెత్త ఎత్తుతూ తలెత్తినప్పుడు మా అక్కకి ఒక వింత కనిపించినట్టుంది గట్టిగ మా అమ్మని పిలిచింది. నేను కూడా జల్దీ జల్దీ ఇంటేనకకి పరుగు పెట్టాను. ఏమైందో అనుకున్న. మా అమ్మ కు, నాకు అదిగో అటు చూడు అని చెప్తే చూసాం. తెల్లని వంకర పూలు పూసాయి మా చిక్కుడు చెట్టుకు. నాకు ఆశ్చర్యం "అమ్మ.. చిక్కుడు చెట్టుకు చిక్కుడు కాయలకి బదులు పూలు పూస్తున్నయి." అని అడిగా.... ముందు పూలు పూసి తర్వాత కాయలు కాస్తాయి అని చెప్పింది మెరుస్తున్న ఆనందపు కళ్ళతో..

ఇక చూడు పొద్దున బడికి పోయేటపుడు మధ్యానం అన్నం బెల్లు మోగి ఇంటికొచ్చినప్పుడు, సాయంత్రం ఇంటికిచ్చి చూచి రాతలు రాసుకునేటప్పుడు  ఇలా ప్రతి రోజు పూల వంక చూస్తుండగా ఒక రోజు చిన్న చిన్న కాయలు గుత్తులు గుత్తులుగా కనిపించాయి. ఏంటో ఈ వేప చెట్టూ ఎంత ఎత్తుందో నాకు సరిగా కనిపించదు కాని అంత వరకు ఈ చిక్కుడు దానితో పాటు నా మనసుతోను అల్లుకుపోయింది.

ఇది పెద్ద రకం విత్తనం కొంచెం పెరగగానే తెంపొద్దు బాగా పెరగాలి ఒక్క కాయలో పది పన్నెండు గింజలు పడతాయి అని బాపు చెప్తే మా అన్న నేను అక్క విన్నాం. మా బాపు చెప్పినట్టుగానే కాయలు చాల పొడవుగా లావు విత్తనాలు దాచుకొని పెరిగాయి. ఇక మా అమ్మ చెప్పడమే ఆలస్యం మా అన్న ఇంటెనక గోడ ఎక్కడం చేతికి అందినవి అందినట్టు తెంపి వర్కు కాయితం (కవర్ సంచి) లో నింపి దింపడంతో,  అమ్మ చాల సేపు తృప్తిగా తాకి, నారను తీసి, ఒక్కో గింజ కు ఆ పక్క ఈ పక్క తోలు ఉండేలా వొలుచుకొని శుబ్రంగా కడిగి, టమాటాలు కలిపి, దట్టంగా మెంతు పొడి, పుదిన, కొత్తిమీర జల్లి కొంచెం రసం గిన్నె చుట్టూ తిప్పి దేవుడికి దండం పెట్టి చేతిలోకి గంటె తో  కొంచెం రాసుకొని రుచి చూసి తృప్తిగా కల్లగేరేయడం చూస్తే వంట సూపర్ అని అర్ధమైంది. 
వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని సిద్ధం అయ్యా, నాతో పాటే మా అక్క అన్న, ఇక తిన్నాం చూడు మొదటి సారి నేను కూడా పెద్ద తిండిబోతుననే బిరుదుని నాకు నేనే ఇచ్చేసుకునేంత తిన్నాను. 
ఉడికిన ఒక్కో గింజ ని కసుక్కుమని కొరుకుతుంటే నేను అనుభవంచిన ఆనందం తెలియచేయడానికి అబ్బో తెలుగు పుస్తకాల్లోనే ఏ పధంకుడ సరిపోదు  పో..
ఇక సూడు పొద్దుకు మూడు పూటలు, వీలు కాకపోతే రోజుకు ఒకపూటైన చిక్కుడు కాయ తో వంటకం లేకపోతే నాకు ముద్ద తిగకపోయేది (లూసు మోషన్లు అయిన కూడా వోధల్లేదు నేను మారం చేసి మరి వండించుకునే వొన్ని) ఎందుకో తిన్న ప్రతి సారి ఓ కొత్త రుచి. వీడికి ఈ చిక్కుడు పిచ్చెంట్ర అని విసుక్కున్న కూడా వోధల్లేదు. కాయలు పండడం ఆగిపోయేంతవరకు  రోజు నాకు పండగే. 

ఇక గల్లిలల్ల ఉన్న వాళ్ళందరి కళ్ళు మన చిక్కుడు చేట్టుమీదనే అని అప్పుడప్పుడు జిష్టి తీస్తుండేది మా అమ్మ. ఆ చెట్ల ముందే మా నాన్న లొల్లి చేసేటోడు, ఆ చెట్ల కిందే, మా అమ్మ చిన్నమ్మ చాల సేపు ముచ్చట్లు పెట్టుకుంటుంటే అవ్వన్నీ ఇంటున్న నా మెదడులో ఓ సినిమాగ కనిపించేది. మా అమ్మ చిన్నమ్మకి చదువంటే తెలియదు కాని మమ్మల్ని చదవించడం ముఖ్యం అని మాత్రం భాగ తెలుసు. ఈ చెట్టూ నిడ కిందే మా ముగ్గురు తాతలు, ఇద్దరు బాపమ్మలు కళ్ళు  మూస్తే పడుకోబెట్టాం, ఈ చెట్టూ కిందే మేము మాతో పాటు మా చిన్నమ్మ ఇద్దరు కొడుకులు ఎన్నో ఆటలాడుకున్నం. ఎన్నో సంతోషాలని ఎన్నో బాధల్ని మాతో పాటు పంచుకున్నాయి.

మా అమ్మకి కాస్త దాన గుణం ఎక్కువే పిరికెడు బియ్యం కూడా దానం చేయలేని మేము ఇంటి ముందుకొచ్చిన వారిని ఉత్త చేతులతో పోనివ్వద్దని అడుక్కునే వారు ఎవరస్తే వారికి చిక్కుడు కాయలు తెంపి ఇచ్చేది ఓ నాలుగో ఐదో కాదు ఏకంగా జోకితే అవి కిలోకి తక్కువ కాకుండా.
ఇంటి సుట్టు పక్కన ఉన్నోల్లంత మా చెట్టూ కాయ గురించి తెగ చెప్పుకునేటోల్లు ఎవ్వరు చెప్పిన కూడా మా అమ్మ ఒక్క రూపాయి తీసుకొని కాయని ఎవరికీ అమ్మలేదు. మనం తిండి దానం చేస్తే మనకు తిండి దొరుకుతుంది అని తిండి లేక అలమటించి తను పస్తులు ఉండి మా కడుపులు నింపిన తనకి తిండి విలువ బాగా తెలుసు. అడుక్కునే వారు ఎవరొచ్చిన కనీసం వారంలో ఒకరిద్దరికైనా భోజనం పెడుతుండడం నాకు ఇప్పటికి గుర్తు. ఏమో హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో డబ్బులు లేకుండా గడిపిన రోజులున్నాయి. కాని తిండి లేకుండా గడిపిన రోజు మాత్రం నాకు ఎదురుపడక  పోవడం మా అమ్మ చేసుకున్న పుణ్యం వల్ల నాకు కలిగిన అద్రుష్టం అని కచ్చితంగా చెప్పగలను.
మా అమ్మ చెప్తుండేది తిండి లేకుండా చావడానికి మించిన దరిద్రపు చావు ఇంకోటుండదు  అని. 
ఆ రకంగా మా అమ్మ మా చెట్టున పెరిగిన కాయలన్నీ మహీంద్ర షాపు కవరు సంచిలో (అప్పట్లో నేను చూసిన మొదటి పెద్ద కవరు సంచి అదే) కుక్కి మరి వీధిలో ఉండే  అంజమ్మోల్లకి, శ్రీనోల్లకి, సాంబరాజోల్లకి, మీనయ్యల్లోంటికి, అంకయ్యోల్లింటికి, వోదేలు వాళ్ళింటికి, బైరిశేట్టోల్లకి, బేబి వాళ్ళకి, మసూద్ వాళ్ళకి, ఇంకా మా దోస్తు  ఆరిఫోల్లకి నేను మా అన్న తీసుకోబోయి ఇచ్చేటోల్లం. ఇక మా అన్నైతే పెద్ద సైకిల్ వేసుకొని ఏకంగా మా చుట్టపోల్లందరికీ కూడా తీసుకుపోయేటోడు దీన్ని బట్టి ఊహించొచ్చు మా చెట్టుకు ఎన్ని కాయలో. ఆ కాయలన్నీ కేవలం మా అన్న చేతికందినంతవారకే, అందనివి ఇంకేన్నవుతాయో..

నాకు భలే చిత్రం అనిపిస్తుండే ఒక్క విత్తనం ఎంత మంది కడుపునింపుతుందో అని. 
అది చూసినప్పటి నుండి మొక్కలమీద గౌరవం చెట్ల మీద ప్రేమ పెరగడం మొదలయ్యింది. ఇక మా దోస్తులతో కలిసి ఎన్ని మొక్కలు నటినానో లెక్కే లేదు. 

రోజులు సంవత్సరాళ్ళు మాతో ముడి పడిన ఆ రెండు ప్రాణులు మా కుటుంబం లో సభ్యుల్ల మాకు అండదండనివ్వసాగాయి. అనుకోకుండా ఓ రోజు ఏమైందో ఏమో చిక్కుడు కొమ్మలు  ఎండి పోవడం మొదలయింది అస్సలు అర్ధం కాలేదు ఏమైందో అని. ఇగ మా అమ్మ పాట్లు చూడాలి శుబ్రం చేయడం కొత్త మట్టి ఎత్తుకొచ్చి పోయడం. అంజమ్మోల్ల అత్తకు పూనకం వొస్తే చేట్టుగురించి వాకబు చేయడం, కుంకుమ పసుపుతో దండం పెట్టడం ఇవ్వన్ని చూస్తుంటే నాకు కూడా గాబరా మొదలైంది. ఇక మా అన్న అయితే ఏకంగా చెట్ల డాక్టర్ నే సైకిల్ మీద కూర్చో బెట్టుకొస్తే చెట్టూ మొదల్లో రెండు ఇంజక్షన్లు ఇచ్చి బరోస ఇచ్చిన కూడా మా మనసు కుదురుగా లేదు. ఎవరు చెప్పారో ఏమో చెట్టుకు  రోగం వొచ్చినట్టుంది మొత్తం ఎండిపోకముందే మొదలు నరికేయమని. కాని మాకు ఆ ధైర్యమే రాలే.

కొద్ది రోజుల తర్వాత దాదాపు సగం ఎండి పోయి మిగిలిన అకులనుండి పురుగు రాలడం చూసి ఇక తప్పదన్నట్టుగా మాకు కట్టెలు కొట్టుకొచ్చే  ముసలాయన వొచ్చి కొడవలి తెచ్చి క్షణంలో మొదలు నరికేసి వేలిపోతుంటే నా గుండె నరికేసినంత బాధయ్యింది. ఆ గాయం నుండి తేరుకోవడానికి చాల రోజులే పట్టింది. 
కొద్ది రోజులకి ఎండిన చిక్కుడు కాయలు రాలి పడడం కనిపించింది. ఓ రెండు మూడు వారాలు బాపు అన్నయ్య ఇద్దరు దాదాపు వేప చెట్టూ చివరి కొమ్మ వరకు గట్టిగ ఊపడంతో ఎండిన చిక్కుడు కాయలన్నీ కింధపడుతుంటే నేను మా అక్క బస్తా సంచులో వేయడం. 
ఆ తర్వాత ఎండిన కాయలో నుండి గింజలని వేరు చేసి రెండు పెద్ద క్యాన్ల నిండా వాటిని దాచి వారానికోసారి ఆ చిక్కుడు గింజల కూరని తృప్తిగా ఆస్వాదించాం.

చిక్కుడు చెట్టూ మొదల్లో పెద్ద రంధ్రం కనపడడం అందులో ఓ పెద్ద ఎలుక వచ్చి వెళ్ళడం గమనించిన మా అన్న ఎలుక చిక్కుడు వేరుని తినడం వల్లే చిక్కుడు చెట్టూ చనిపోయిందని నిర్నయించేసుకొని ఇంట్లో ఉన్న ఎలుకలన్నిటిని వెంటాడి వేటాడి ఇత్తడి ఇత్తడి చేసాడు.

ఏంటో కొద్ది రోజులకి కూలడానికి సిద్ధమైన ఇల్లు, పెరిగిన అప్పులు మరో కొత్త అప్పులు చేయలేని స్తోమతతో ఇల్లు అమ్మకానికి పెట్టాం. నేను గడిపిన ఇల్లు దూరమవబోతున్న బాధ కన్నా నా వేప చెట్టుకి దూరమవుతున్నననే భాదే నాకు ఎక్కువైంది. 
ఎంత చేదుకయాలని పుట్టించిన ఆ చెట్టులో ఓ తీయని మనసుందని నాకోసం రాల్చిన నేను ఆస్వాదించిన ప్రతి వేప పండులోను నాకు అవగతమైంది. 

ఎందుకో భాధ, ఏ భాదైన తనకే చెప్పుకున్న.. ఈ భాధ ఎవరికీ చెప్పుకోవాలో కూడా తెలియలేదు పట్టేడంత దుక్కాన్ని పంటి బిగువున దాచుకోవడం నాకు అప్పటికే అలవాటయ్యింది. ఏంటో అది మా ఇంట్లో మేము గడపబోయే చివరి రోజు. మూలమీద వేరే ఇల్లు కిరాయికి తీసుకొని ఈ ఇంటిని వీరేశం దుకాణం వోళ్లకి అమ్మేసాము. 
ఆ రాత్రంతా నాకు నిద్ర రాలేదు ప్రతి గోడ, ప్రతి మూల మౌనంగా నను హత్తుకొని ఏడవడానికి సిద్ధంగా కనిపించాయి. 
తెల్లారి ఇంటివెనకాల భావిని తృప్తిగా చూసుకున్నాను. బొక్కేనతో   నీళ్ళు చేదుకొని త్రుప్తిగ స్నానం చేసి వేప చెట్టుకి అమ్మ పూజ చేస్తుంటే తన పక్కనే నిల్చొని దన్నం పెట్ట. 
"వేప చెట్టూ మరియు నేను" మా ఇరువురికే తెలుసు ఆ క్షణంలో మేము అనుభవిస్తున్న వేదన. ఓ మూగ వేదన నా మనసు తన మనసుకు దూరమవుతుందో లేక నా మనసే నాకు దూరం అవుతున్నదో తెలియట్లేదు. కంట నీరు బయట కక్కకుండా అదిమి పట్టుకున్న. 
నెమ్మదిగా కళ్ళు తెరిచిచూస్తే అమ్మ వేపచేట్టుని అమాతం వాటేసుకొని బోరుమని ఏడవడం కనిపించి ఇక నాక్కూడా  దుక్కం ఆగలేదు.  
నేను కూడా తనివి తీర నా యాప చెట్టుని వాటేసుకొని ఏడుస్తూ అలాగే ఉండి పోయా చాల సేపు...

ఏంటో ఈ అనుభంధం ఏదో విడదీయలేని ఓ ఆత్మీయ స్నేహం ఆ చెట్టులో దాగుందని నా నమ్మకం. భహుశ ఈ నమ్మకాలకే ఆత్మ దైవం అని పేరు పెట్టారు కాబోలు అని అనిపించింది. అదే గనక లేకపోతే ఎందుకు నా మనసు అల యధ్రుచికంగా ఆ రెండు చెట్లతో పెన వేసుకుపోయింది.
సైన్సు నా మనసులో కలిగే ఈ వింత భావానికి ఓ పిచ్చి పేరుని తగిలించి చేతులు దులుపోకోగాలదేమో గాని నాకు మరియు ఈ చెట్టూ మధ్యన ఎవరికీ కనిపించని ఓ ప్రేమ దాగుందని గుర్తించలేదు.

ఇదేం పిచ్చి అని కొందరు హేళన చేసిన పాపం మా పిచ్చి మనసులు అందరికి అర్ధమైతే ఎంతబవుండో. 
కనీసం కొందరికైనా ఈ పిచ్చి మనసు ఉండే ఉంటుంది అదే గనుక ఉండి ఉంటె ఈ మౌన ఆలంబనలు మరువలేనివి అని వారు కూడా నాతో ఎకిభావిస్తారు. 
అలాంటి మనసున్న వారందరు కూడా మొక్కలతో అనుభంధం పెంచుకుంటే జరిగే నష్టమేమి ఉండదు అని నా భలమైన నమ్మకం.

మా చిక్కుడు చెట్టుకి మా వేప చెట్టుకి నా ఈ కథ అంకితం.

(నాకు దూరమైన చిక్కుడు చెట్టూ భాధ  మనసులోనుండి చేరిగిపోదేమో కాని. ప్రతి మూడునెల్లకో ఆర్నేల్లకో వెళ్ళినప్పుడు ఇప్పటికి మా పాత వీధిలోకి వెళ్తే అదే చిన్న గల్లి, మనుషులు మారారు, నాతో పెరిగిన పిలగండ్లకి పెల్లిలై పిల్ల పాపలతో కొత్త జీవితాలను మొదలు పెట్టారు. ఇళ్ళకు మెరుగులు దిద్ధికున్నాయి. అయిన అదే పచ్చని గల గల రావాలతో ఇప్పటికి అందరి కష్ట సుఖాలని పంచుకుంటూ మౌనంగా తనవంతు సాయం తను చేసుకుంటూ మారకుండా పదిలంగా మా యాప చెట్టూ కనిపించడం నాకు చాల ఆనందంగా ఉంటుంది.)


 Raghu Mandaati
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment