ఓ తులసి కథ ...(పార్ట్-5)


చూస్తూ చూస్తూ వారం రోజులు గడిచి పోయాయి. గుణరాం నుంచి ఓ కాల్ లేదు , నాకు కొంచం మొండితనం.తనే చేయకపోతే నేను ఎందుకు చెయ్యాలి అన్నట్టు నేను కాల్ ఆర్ మెసేజ్ చేయలేదు. ఆడది ఆలోచించడం మొదలు పెడితే చిన్న పాటి అసూయ కూడా మొదలవుతుందేమో, గుణరాం గురించి అలోచించడం మొదలైంది. కాల్ చేద్దామని అని పించేది, మళ్లీ నాలో నేనే అదుపు చేసుకునే దాన్ని.

" మేడం మీ గురించి ఎవరో వచ్చారు" ఆఫీసు బాయ్ వచ్చి చెప్పి వెళ్లి పోయాడు.

ఒక్క క్షణం గుండె వేగం రెట్టిoపైంది . గుణరాం అని మనసుకి తెలుసు, నా గురించే వచ్చాడనీ తెలుసు. వెళ్ళద్దని తనువును కట్టడి చేసినా వెళ్ళు వెళ్ళు అంటూ మనసు చెపుతూంది. ఇంక ఎక్కువ సేపు వెయిట్ చేయించడం బావోదని నా కోసమే ఎదురు చూస్తూ ఆఫీసు బయట నేరేడు చెట్టు దగ్గర బెంచ్ మీద కూర్చున్న గుణరాం దగ్గరకి వెళ్ళాను. మొదటి సారి నాకోసం ఒకరు ఆఫీసుకి ఇలా రావడం తెలిసున్న వాళ్ళ అందరి మధ్య మాట్లాడటం కొంచం ఇబ్బంది గానే ఉంది. ఆఫీసు స్టాఫ్ లో కొందరు మా ఇద్దరినీ చూస్తూ నా కేసి చూసి నవ్వుతూ వెళ్ళిపోతున్నారు. మనసుకి నచ్చిన వ్యక్తితో మాట్లాడటం కూడా ఎంతో ఇబ్బందిగా తోచింది అందరి ముందూ .

బావున్నారా ఎందుకొచ్చారు అని కళ్ళతో నే అడిగాను, నా ఇబ్బంది గమనించాడో ఏమో తను కూడా మిమ్మల్ని చూడటానికే వచ్చాను, చూసాను వెళతాను అన్నట్టుగా లేచి నిలబడ్డాడు.నాకోసం వచ్చిన తనకి కనీసం టీ కూడా ఆఫర్ చెయ్యకపోతే ఏమనుకుంటాడో, ఇబ్బంది పడుతూనే రండి కాంటీన్ కి వెళ్లి కాఫీ త్రాగుదాం అన్నట్టు పిలిచాను.

"తులసి గారు మిమ్మల్ని చూసి , మీ మాటవిని వారం రోజులైంది. మీకు కాల్ చేసి నేను ఎక్కడ ఇబ్బంది పెడుతున్నానో అని ఇన్ని రోజులు మీకు కాల్ చేయలేదు, కాని ప్రతీ క్షణం మీరే గుర్తుకువచ్చారు,గుర్తుకొచ్చిన ప్రతిసారి నా మనసుకి నేనే సర్దిచెప్పే వాడిని తులసిగారు కాల్ చేసే వరకు తనని ఇబ్బంది పెట్టద్దని. ఋతువులెన్నున్నా వసంతంలో ఉండే అందమే వేరు, నాతో ఎంత మంది మాట్లాడినా మీరు మాట్లాడితే నా మానసు పడే ఆనందమే వేరు .ఇన్ని రోజులు చాల బలవంతంగా నన్ను నేను అదుపుచేసుకుంటూ ఆగానండి . ఇక నా వాల్ల కావట్లేదు మీరు ఇబ్బంది పడినా, చెప్పకుండా ఆఫీసు కి వచ్చాడని తిట్టుకున్నా మిమ్మల్ని ఒక్క క్షణం చూసి వెళ్ళిపోవాలని వచ్చాను . తులసి నాకు మనసులో ఉన్న మాట దాచుకోవడం చేతకాదు, మీరు ఒప్పుకుంటే మీతో కలిసి జీవితాంతం ఒక తోడుగా , మీ పాపకి ఒక తండ్రిగా వుండాలనుకుంటున్నాను. ఐ లవ్ యు అనే మాట మనిద్దరి మధ్య చాల చిన్న పదం, నాతో నువ్వు జీవితాన్ని పంచుకుంటావా? నీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంటాను "

ఈ వారం రోజులు నాలో నేను పడే మానసిక సంఘర్షణకి తెరదించుతూ తను చెప్పదలుచుకున్నది చెప్పి వెళ్ళిపోయాడు. జీవితంలో మొదటి సారి మనసుకి తెలియని ప్రేమానుభూతిని తొలిసారి వినడం , ఆస్వాదించడం. నిన్ను నేను ప్రేమిస్తున్నానని అని ఒకరు ధైర్యంగా వచ్చి చెప్పడం చాలా కొత్తగా ఉంది .
చెప్పలేని ఆనందం ఒక ప్రక్క , చేస్తున్న పని తప్పో ఒప్పో తెలీనిస్థితి మరోప్రక్క నాలో సందిగ్ధాన్ని రేపుతున్నాయి. నా సంతోషాన్ని దుఃఖ్ఖాన్ని పంచుకునే స్నేహితులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కావ్య రెండు సంద్రం. హడావిడిగా ఆఫీసు లోపలకి వచ్చి హ్యాండ్ బాగ్ తీసుకుని ఎవరితో చెప్పకుండానే బీచ్ కి వెళ్ళిపోయాను .

పున్నమి వెళ్లి వారం రోజులు కావడంతో కెరటాల తాకిడి కూడా తక్కువాగా ఉంది . నే చెప్పే మనసు మాటల్ని , నా మానసిక సంఘర్షణని వినమంటూ కాస్త జన సందడికి దూరంగా కూర్చున్నాను. నేను,సంద్రపు ఘోష, నన్ను పలకరిస్తూ వచ్చి పోయే కెరటాల తాకిడి , వెళ్లొస్తాను రేపు మళ్ళి వస్తానంటూ పడమటి దిక్కుకు వాలిపోతున్న సూర్యుడు. నీలి రంగు పరదాని సంద్రపు ఒడి మీద పరచి నా మనో వేదనని వినడానికి వినీలాకాసం కూడా వేచి చూస్తూంది.నేను నాలాగే వుండటమా గుణరాంతో కలిసి కొత్త జీవితం పంచుకోవడమా నువ్వే చెప్పాలి . నన్ను పలకరించడానికి వచ్చే మూడు అలల్లో ఏ రెండు నా పాదాలను తాకినా గుణరాంతో రేపటి నుంచి నా జీవితం మొదలవుతుంది,లేదంటే ఇక మళ్లీ తన గురించి ఆలోచించను .నా పాదలనే ప్రశ్నచేసి అలలనే సమాధానం ఇమ్మంటూ ఉచ్వాసను ఆపి నిశ్వాసని ఓపికపట్టమంటూ వచ్చే అలకేసి చూస్తూ కూర్చున్నాను .

మొదటి అల నీ ప్రేమకి నే సమ్మతమంటూ నా పాదాలను తొలిముద్దు పెట్టి వెళ్ళింది.
రెండవ అలకి మొదటి అలకి అంతగా స్నేహం లేనట్టుంది,మధ్యలోనే ఆగి ఇక సెలవంటూ వెళ్ళిపోయింది.

ఎందుకిలా ఫిక్స్ అయ్యాను,మూడవ అల పాదాల్ని తాకకపోతే గుణరాంని నేను మిస్ అవుతానేమో ! కొన్ని క్షణాలు ఏదో కోల్పోతున్నట్టు అనిపించింది . ఒడ్డును ముద్దాడుతూ నా వైపే మూడవ అల.

ఇంటికి వచ్చేసాను, రాగానే నా చిట్టి తల్లిని ఒక ముద్దు పెట్టుకున్నా . నాకు నచ్చిన ఇళయరాజా పాట ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆ నాటిది పాట వింటూ గుణరాంకి ఫస్ట్ టైం మెసేజ్ పెట్టాను. మీకు అభ్యంతరం లేక పొతే రేపు ఉదయం మహలక్ష్మి టెంపుల్ కి వస్తారా అని .

ఇలా పంపానో లేదో అలా మెసేజ్ వచ్చింది మెరుపుకంటే వేగంగా " తులసి గారు పంచె కట్టుకునా లేక మామూలుగానా "

అబ్బో కొంచం కామెడీ టచ్ కూడా బానే ఉందే మెసేజ్ చదువుతుంటే నాలో నాకే నవ్వు ఆగటం లేదు. ఫస్ట్ టైం జీవితం లో ప్రేమ , ప్రేమించబడటం, ప్రేమలో వుండే అనుభూతిని ఆస్వాదించటం.గతంలో ఫ్రెండ్స్ చెపుతుంటే ఓహో ఇలా ఉంటుందా అని అనుకునేదాన్ని. ఇప్పుడు నన్ను ఈ తీయటి మైకం అణువణువునా స్పుశిస్తుంటే చాలా కొత్తగా వుంది . శ్రీ సూర్యనారాయణుడు ఎప్పుడు మేలుకుంటాడో నాకు ఒంటరితనమనే చీకటిపోయి గుణరాంకు జతగా ఎప్పుడు ప్రేమ వెలుగుని చూస్తానో రాత్రంతా ఇవే ఆలోచనలు.

అలా రవికిరణం మా వీధి గడప మీద తొలిముద్దు పెట్టిందో లేదో చక్కగా తయారయి గుడికి బయలుదేరాను. నేను చాలా ముందు వచ్చేసేనేమో . తిను ఎప్పుడు వస్తాడో ఎంత సేపు వెయిట్ చెయ్యాలో అనుకుంటూనే గుడి వైపుగా నడుస్తున్నాను . కుర్తా పైజామా కట్టుకుని డోరేమాన్ కార్టూన్ ఫిలిం కి చిన్న పిల్లలు ఎదురు చూసినట్టుగా నాకోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత ప్రేమ నాలోనే మనసులో మురిసిపోయాను.

గుడ్ మార్నింగ్ తులసి గారు . గుడి తలుపులు తెరవకుండానే వచ్చి కూర్చున్నా, మీకోసమే ఎదురు చూస్తున్నా. అబ్బా టెన్షన్ తో రాత్రంతా నిద్ర పట్టలేదండీ . ఎందుకు రమ్మన్నారో ఏం చెపుతారో ఇలా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే వున్నాడు.

అతని మాటలకు బ్రేక్ వేస్తూ గుణరాం గారు మీరు నిన్న తీసుకున్న నిర్ణయం నేను పూర్తిగా నమ్ముతున్నాను , మీరు మళ్లీ ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఒక్కరే కాదుగా మీ కుటుంబం కూడా ఉందిగా .. నా మనసులో నలుగుతూన్న విషయాన్ని చెప్పకూడ దనుకుంటూనే చెప్పాను. ఏం మాట్లాడ లేదు మౌనంగా వున్నాడు.

అమ్మవారి దర్శనం చేసుకుని బయటకి వచ్చి ఓ ప్రక్కగా కూర్చున్నాం . తులసి ఓ సారి కళ్ళు మూసుకో . ఎందుకా ఏమిటా అని ఆలోచించలేదు వెంటనే మూసుకున్నా . ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది, అమ్మవారి కుంకుమ నా నుదుటన తను పెడుతుంటే . కొన్ని ఆనందాలు మాటల్లో చెప్పలేం . తనకేసలా చూడటమే నావంతైయ్యింది.

"తులసి నిన్ను ఈ క్షణం పెళ్లి చేసుకోమన్నా నాకు అభ్యంతరం లేదు కాని నా కుటుంబ సభ్యులు ఒప్పుకోరు . మన పెళ్లి విషయంలో నా వాళ్ళు ఎవ్వరూ రారు . నీ తరపున ఎవ్వరు వచ్చినా నాకు ఇబ్బంది లేదు . మన పెళ్ళైన 3 సంవత్సరాలకు కాని నేను చెప్పను మా ఇంట్లో నాకు నీతో పెళ్లి అయ్యిందనే విషయం. నా ఆదర్శ వివాహం వాళ్ళకి ఇష్టం వుండదు సరికదా నన్ను ఇంటికి రావద్దంటారు. వాళ్ళని ఈ వయసులో నేను కష్టపెట్టలేను "

తను చెప్పదలుచుకున్నది చెప్పాడు. ఇక నిర్ణయం నావంతైంది. నా జీవితంలోకి గుణరాంని ఎలా ఆహ్వానించాలని ? అందరికి తెలిసేలాగా ? నా మనస్సాక్షికి తెలిసేలాగా? నేనున్న సంఘంలో తినతో పాటు జీవించాలా? లేక మనకంటూ ఎవరూ తెలీని చోట కొత్త జీవితం మొదలు పెట్టాలా ? ఈ రోజంతా ఆఫీసు లో వర్క్ చేస్తున్నా కాని ఇవే ఆలోచనలు.

పాపకి తండ్రిలా , నాకు భర్తలా. ఈ రెండు పాత్రలలోనూ నేను తనని చూడాలనుకుంటున్నాను, సో నేనున్న సమాజం లో ఇది కుదిరే పని కాదు , నా వాళ్ళకు చెప్పినా ఒప్పుకోరు . నీ జీవితంలో పెళ్లి కలసి రాలేదు .మళ్లీ ఇంకొకరు నీ జీవితంలోకి వస్తే ఇంకెన్ని కష్టాలు పడతావో. ఇలా నే తీసుకున్న నిర్ణయానికి విలువ ఇవ్వరు. ఒకటే మార్గం నేనున్న సమాజానికి దూరంగా తెలీని వాళ్ళ మధ్య కొత్త జీవితం మొదలు పెట్టాలి.

కావ్య సహాయంతో తనకి తెలుసున్న గుడిలో మా పెళ్లి జరిగింది . పెళ్లి పెద్దగా కావ్య, మా మనస్సాక్షులు , పురోహితులు ముగ్గురే. 


బహుదూరపు బాటసారి
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment