గడక రోజులు


ఏంటో హైదరాబాద్ కి వొచ్చిన ఇన్నేళ్ళ తర్వాత మా రెండో వీధి చివరి గల్లి లో చిన్న హొటల్ ముందు తెల్ల గుడ్డ మీద రాసి ఉన్న నీలి అక్షరాలు "మొక్క జొన్న గడక ప్రతి శుక్రవారం" చూసి ఆశ్చర్య పోయాను. పిజ్జా బర్గర్లు, పాని పూరీలు, చాట్ మసాలాలకు అలవాటు పడిన మా కాలనీ జనాలకు అదేంటో కూడా తెలియక పోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాకపోయినా దాని విలువ తెలిసినందరి మనసుల్ని అక్కడికి లాగేసినట్టుంది. పొద్దున్నుండే రిటైరు మాష్టరులందరు ముస్తాబై అక్కడే కూర్చున్నారు. నేను ఆఫీసు కి బయలుదేరుతుంటే..

బస్సు స్టాప్ వైపుకి నా నడక సాగుతున్న మనసు మాత్రం చిన్న నాటి గడక గిన్నేవైపుకు మళ్ళింది.
అవి మరి చిన్నప్పటి రోజులు. అంటే మా బాపమ్మ(నాయనమ్మ) బతికున్నప్పటి మాట మా పెంకుటింట్లో ముందు గదిలో మేముంటే వెనక గదిలో మా బాపమ్మ ఉండేది. ఆమె చలాకీగా తన పనులు తాను చేసుకున్న రోజులు చాల తక్కువగా చూసాను. నడుస్తుంటే జారి పడి తుంటి విరిగినప్పటి నుండి శ్వాస వోదిలేవరకు మంచాన పడి ఉంటె మా అమ్మే చూసుకుంది. దానికి తోడు ఆ రోజుల్లో ఆ రోజేంటి? ఏ రోజు కూడా తూలకుండ ఇంటికొచ్చిన రోజే లేదు మా బాపు. తను ఇచ్చే పది పరక రూపాయలతో ఇల్లు ఎలా నేట్టుకోచ్చేదో ఆలోచిస్తే ఇప్పటికి నాకు ఆశ్చర్యమే. కంట్రోల్ బియ్యం అయిపోయేంత వరకు అల్లం ఎల్లిపాయ కలిపి నూరిన కారంలో మిల్లులో పట్టుకొచ్చే పల్లి నూనె ను కలుపు కొని తింటూ రోజులు గడిచేవి. అవి అయిపోయకే  వీరేశం దుకాణం లో కాని  జెండా కాడి రాజన్న దుకాణంలో గాని ఓ కిలో బియ్యం తీసుకొచ్చుకుంటే  ఆ రోజు గడిచేది.

ఇక బాపు డబ్బులు ఇవ్వని రోజు అయితే రాజన్న దుకాణం కి కొంచెం ముందే ఎడం పక్కన ఉండే ఒంటికాలు కిష్టయ దుకాణం (ఒక ఆక్సిడెంట్ లో తన కాలు విరిగేసరికి అందరు అల పిలవడం మొదలయ్యింది అంతకు ముందు ఆయన్ని కంట్రోల్ కిష్టయ అనెటోల్లు అయన కంట్రోల్ షాపులోనే పనిచేసేవాడు.) లో కెళ్ళి ఓ కిలో నూకలు తెచ్చుకొనేటోల్లం.

మా అమ్మకి ఎవరు చెప్పారో ఏమో ఎల్లం బాజార్ (వరంగల్ బట్టల బజార్ కి తగ్గర్లో ఉండేది) కి నన్ను కూడా తోల్కబోయి ఓ దుకాణంలో నాలుగు కిలోలు మొక్కజొన్నలు, నాలుగు కిలోల పచ్చజొన్నలు పట్టుకోచ్చినం, ఎందుకు అమ్మ ఇవి అని అడిగితే రోజు గడక పోసుకుంధం అని చెప్తే అప్పటికి అదేదో కొత్తగా వినపడి కొత్త వంటకమై ఉంటుంది అనుకున్న అట్టా తీసుకోచ్చినమో లేదు అదే సాయంత్రం రాలచెట్టు కాడుండే  గిర్నికి నేను మా అక్క రెండు పెద్ద క్యాన్లలో వాటిని మోసుకు పోయి గడక పట్టించుకోని వొచ్చే సాము.

ఇక చీకటి పడుతుంటే ఒత్తి సరి చేసి చిమ్ని దీపంలో కిరోసినే పోసి వెలిగిస్తుంటే "పజ్జోన్నల గడక జేయకు పిలగాండ్లకు చేదు కొడతాది" అని మా బాపమ్మ చెప్తుంటే నాకు అర్ధం కాలేదు గాని మొక్క జొన్న గడక పెడుతున్న అని మా అమ్మ జెప్పింది (ఆ రెండింటికి తేడా ఏంటో కొద్ది రోజుల్లోనే తెలిసింది నాకు) ఇంటెనక కట్టెల పోయి దగ్గర ములుగురోడ్డులో మొన్న అంటే అంతకు మూడు రోజుల క్రితం పట్టుకొచ్చిన రెండు మడ్ల కట్టెలను పొద్దంత ఎండలో ఎండబెట్టింది అందులో నుండి ఓ నాలుగు కట్టెల్ని తీసుకొచ్చి పిడక మీద కొంచెం కిరోసిన్ పోసి వెలిగించి, మెల్లెగా పొయిలో పెట్టి ఆ చిన్న మంట మిధ ఒక్కొక్క కట్టే పేడులను పెడుతూ మెల్లగా  గొట్టం తో ఊదుతూ, కట్టెలకు మంట అందుకున్నాక మొక్కజొన్న గడకని కడిగి నీటితో నింపిన గిన్నెను మండుతున్న కట్టెల పొయ్యి మీద పెడుతుంటే, పేడతో అలుకు జల్లిన నేలపై నిక్కరు సర్దుకుంటూ కూసొని, చుట్టూ చీకటి వెలుగుతున్న పొయ్యి మంట వెలుతురు, మసగ్గా కనిపించే వెన్నల వెలుతురు, అప్పుడప్పుడు వీచే వేప చెట్టు గాలి మా అమ్మ పక్కనే మా అక్క కొంచే ఎడంగా చిన్న ఉప్పు డబ్బా, పోయి మీద నుండి గిన్న దింపడానికి సిద్ధం గున్న మసిగుడ్డ దానితో ఆడుకుంటూ నేను నా పక్కనే అయిపోయిన టానిక్ సీస లో కిరోసిన్ పోసి దాని మూతకి చిన్న రంధ్రం చేసి సన్నని గుడ్డ పీలిక మొదలుని వోత్తిగా చేసి మిగతా గుడ్డని సిసలోకి ముంచి మూత పెట్టి వెలిగించిన  చిన్న దీపం. ఇక నేను మండుతున్న నిప్పులవైపు, గిన్నేలో ఉడుకందుకుంటున్న గడకవైపు చూస్తూ అమ్మ అక్క ముచ్చట్లు పెట్టుకుంటుంటే వింటూ ఉండేవొన్ని, కాసేపటికి పప్పు దువ్వ వెనక భాగంతో గడక ఉండలు కట్టకుండా తిప్పుతుంటే తెల్లని పొగలు మెరుస్తూ వంకర్లు తింకర్లుగా గాల్లో కలిసిపోతుంటే అలాగే చూస్తుండేవొన్ని. 

ఆ గడక పూర్తోవుతుంటే కొంచెం ఉప్పు కలిపి మరి పలుచగా  కాకా మరి గట్టిగ కాక కొంచెం లూసు ఉండేలా చూసుకొని మసి గుడ్డతో దింపి పక్కన పెట్టి. చిటికెడు గడకని ఎడం చేత్తో తీసి గిన్నె చుట్టూ పోయి చుట్టూ తిప్పి పొయిలో వోదిలేది (సాధారణంగా ఏదైనా స్పెషల్ వంట చేస్తే అల దిష్టి తీస్తుంటుంది మా అమ్మ కాని అప్పుడు నాకు తెలియలేదు చాల రోజుల వరకు అదే మా రోజు వారి భోజనం అని).

ఇంటి ముందు వచ్చే పోయేటోళ్లని చూస్తూ కూర్చున్న మా అన్నని పిలిచి పైసలు చేతిల పెడుతూ పావుకిలో పెరుగు పట్టుకురమ్మని తోలింది, ఇక మా అన్నతో పాటే నేను మెల్లిగా నడుచుకుంటూ వీరారెడ్డి ధావకన కి  ఎదురుగా ఉండే ప్రకశోల్ల మార్వాడి దుకాణంలో పావుకిలో పెరుగు పొట్లం గడుతుంటే నా చూపులన్నీ గ్లాస్ అద్దం లోపల నుండి ఊరిస్తున్న మిక్ష్చర్, గులాబు జామున్ గిన్నె వైపే ఉండేది. పెరుగు కట్టడం అయింతర్వాత పైసలిచ్చి ఇగ మెల్లగా ఇంటికి చేరుకొనే సరికి ఇంటెనక బియ్యం బస్తా సంచులతో కుట్టిన తాయారు చేసిన పెద్ద సంచిని నేలమీద పరిచి ఓ చిన్న డబ్బాని బోర్లించి దానిపై రెండు దీపాలను పెట్టి, గడక గిన్నె, ఐదు పళ్ళాలు, మంచి నీళ్ళ చెంబులు, చిన్న జాడీలో పొద్దున నూరిన ఎల్లిపాయ కారం ముద్ద, పల్లి నూనె టిఫిను, అన్ని సిద్ధం చేసి పెట్టేది.

ఇక మేము రావడమే ఆలస్యం పెరుగు సంచి చేతిలో తీసుకుంటూ కల్జేతులు కడోక్కొని కూసొండ్లి అని చెప్తూ మా బాపమ్మకి పళ్ళెం సిద్ధం చేసి ఇంకో చేత మంచినీళ్ళ చెంబు పట్టుకెళ్ళి ఇచ్చే పనిలో ఉంటె మా అన్న బావి లో నుండి నీళ్ళు తోడి పెద్ద బకెట్ లో పోస్తుంటే లైబాయి సబ్బుతో కళ్ళు చేతులు కడుక్కొని పొడి తువల్లుతో శుబ్రంగా తుడుచుకొని సంచిలో కూచుంటే మా అన్నకి అక్కకి నాకు మూడు పళ్ళాలలో గడక పోసి నూనె కలిపినా కారం ముద్ద గడక పక్కనే వేసి ఇచ్చి తను కూడా ఇంకో పళ్ళెం సిద్ధం చేసుకొనేది.

చూపుడు వేలుతో కొంచెం తీసుకొని నాలుకకు అద్దుకున్న, పెద్దగా రుచించలేదు. ఇంకొచెం ఇంకొచెం అల తింటూ తింటుంటే కొద్దిగా రుచి మొదలయింది దానికి తోడు కారం అద్దుకుంటుంటే మరింత రుచి చేరుకుంది. ఒక దఫా పూర్తయ్యాక, మళ్లీ అన్ని పళ్ళాలలో గడక పోసి, పెరుగు మూట విప్పి గడ్డ పెరుగుని గిన్నెలో వేసి నీళ్ళు ఉప్పు కలిపి అందరికి కాస్త పలుచగా మజ్జిగ లాగ చేసి గంటె తో పోస్తుంటే నెమ్మదిగా జావా మాదిరి ఎలా చేసుకోవాలో అమ్మ చెప్తుంటే అలాగే కలుపుకొని తినడం రాక నేను పళ్ళెంతో ఆ జావా ని తాగుతుంటే గొంతులో నుండి కమ్మని రుచి గుండెలకు చేరేది. చాల కాలం తర్వాత జిహ్వ సంతృప్తి కలిగింది. పొట్ట నిండేలా గడకని ఆస్వాదించి.అన్ని సర్దుకొని ఇంటేనకాలే పక్కలేసుకొని నడుం వాల్చానో లేదు ఎప్పుడు నిద్రలోకి జారుకున్ననో గుర్తు కూడా లేదు.

సాధారణంగా మా బాపు పనికిబోయి రాత్రి ఎప్పుడో పన్నెండు ఒకటి గంటలకు వొస్తాడు. అప్పుడు నేను మంచి నిద్ర లో ఉంటాను. ఆ రాత్రి వొచ్చి తిని పడుకునే వరకు మా అమ్మకు ధడే ఇక గొడవ కొంచెం ఎక్కువైతే మా అన్న లేచి మా అమ్మని కొట్టకుండా చూసే టోడట. నేను పడుకోవడానికి ముందు వస్తే ఆ దడ నాకు కూడా పట్టుకునేది. గడక చేసిన రోజు మా బాపు తాగోచ్చిన యే లొల్లి పెట్టుకోకుండా తిని పడుకున్నాందుకు అమ్మ మనసు కాస్త కుదుట పడిందంట.
ఇక అప్పటి నుండి మొదలు వారం రోజులు మూడు పూటలా గడకే. ఇక మొక్క జొన్న గడక మత్తులో ఉన్న నాకు అది అయిపోయిందని  పచ్చ జొన్న గడక వండిందని తెలిసింది. అది అల తిన్నానో లేదు నోరంతా ఒకటే చేదు, అస్సలు తిన బుద్ధి కాలేదు, అప్పుడు గాని అర్ధం కాలేదు బాపమ్మ ఎందుకు వద్దని అందో. నేను తప్ప అందరు తినే వారు. ఎంత ఇష్టం పెంచుకుంధామన్న ఎందుకో చేదు గడక అస్సలు తినలేక పోయా. ఇక నా ఏడుపు తట్టుకోలేక కిష్టయ్య దుకాణంలో నూకలు తెచ్చేది.
ఇంకో వారం ఎల్లం బాజార్ కెళ్తే మొక్క జొన్నలే తీసుకో అవ్వోద్దని ముందే బెదిరిచ్చాను మా అమ్మని. ఆమె నవ్వుతు సరే సరే. అంది.

కొద్ది రోజులకి మా అమ్మ వెయ్యి రూపాయల చిట్టి తీసుకొని ఇంట్లో కూరగాయల దుకాణం మొదలు పెట్టింది. పొద్దునే ఐదు గంటలకు లేచి వెళ్లి వరంగల్ మార్కెట్ నుండి కురగాయాలు తీసుకొచ్చి. మా ఇంటి ముందు గద్దెల మీద ముందు గది లో రోజు పది పదకొండు వరకు అన్ని అమ్ముడపోయేవి. ఇక కూరగాయాల దుకాణం మొదలైనప్పటి నుండి గడకతో పాటు రోజుకో రకం కూరతో పళ్ళెం నిండేది. ఏం చేసిన పెరుగుతో కలుపుకొని తాగాడమంటే నాకు భలే ఇష్టం.

ఒక రోజు స్కూల్ లో కాయగూరలు పౌష్టిక ఆహరం గురించి పాటం చెపుతూ మధ్యలో టీచర్ అడిగింది. మీకు ఇష్టమైన వంటకలేంటి అని. అందరు వాళ్ళకి నచ్చిన వంటకాలు చెప్పారు. నేను టక్కున లేచి అన్నం, పప్పుచారు, గడక, పెరుగు అని చెప్పా అంతే మా క్లాసు పిలగండ్లంత వింతగా చూసారు, ఆ టీచర్ నా నోట గడక మాట వినగానే అదేదో అశుద్ధం తినే వాడిలా ఒక్క సారి మొహం అంత వికారంగా చేసుకుంటూ గడక పేరుగా... అని దీర్గం తీస్తూ మరి వెకిలిగా నవ్వే సరికి క్లాస్ మొత్తం గొల్లున నవ్వింది. అంతే నాలో నేను కుంచించుకుంటూ తల నేలకేసుకొని బెంచిలో కూర్చొన్న. ఎందుకల నవ్విందో అర్ధమే కాలేదు. ఒక్క సారిగా అందరు నన్ను వెలివేసినట్టుగా పిచ్చి పిచ్చి ఊహలతో స్కూల్ ఐపోయింది. తిన్నగా ఇంటికొచ్చి అమ్మకి ఈ విషయం చెప్పల వద్ద అమ్మతో ఇలాంటి విషయాలు చెప్పాలంటే కాస్త భయం ఎందుకంటే విషయానికి ముందు నాకు వొచ్చేది ఏడుపే, ఏడుపు ఆపుకొని చెప్పలేను కాబట్టి, ఇంటికెళ్ళగానే, మెల్లెగా అమ్మ వొళ్ళో తల పెట్టుకొని, అమ్మ మనం గడక ఎందుకు తింటున్నాం అని నెమ్మదిగా అడిగా  నా ప్రశ్నకు "మనం ఆరోగ్యంగా ఉండాలని నీకు చదువు మంచిగా రావాలని మనకు దేవుడు ఇది ఇచ్చాడు."  అని తడి కళ్ళు కొంగుతో వొత్తుకుంటూ చెప్తుంటే నాకు దుక్కం ఆగలేదు. దగ్గరకు వాటేసుకుంటుంటే  వెచ్చని అమ్మ వొడిలో నా ప్రశ్నలన్నిటికీ  సమాధానం దొరికింది. ఇక టీచర్ విషయం చెప్పాల్సిన అవసరం లేదనిపించింది.

ఆ రోజు రాత్రి కలలో టీచర్ కొరడాతో వెంట బడడం ఆమె వెనకాలా నా క్లాసు పిలకాయలంత గడక గడక అంటూ అరుస్తూ కేకలు పెడుతుంటే వారిని తప్పించుకుంటూ నేనొక్కడినే పరుగులు పెట్టడం. అదేదో దేశం లో తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి తరిమినట్టు నేను గడక తినడం పాపంగా నను వెంటాడుతున్నట్టు భయంకరమైన కలొచ్చింది. ఒళ్ళు జలదరించి నిద్ర మధ్యలోనే ఉలిక్కి పడి లేచాను. నా మిధ చేయి వేసి పడుకున్న అమ్మ ఒక్క సారిగా మేలుకొని ఏమైంది అంటూ నా ఒళ్ళు చూసింది "జ్వరం". వెంటనే జిందా తిలిస్మాత్ రెండు చుక్కలు చెంచాలో కొన్ని నీళ్ళతో కలిపి తాగించి చాతికి ముక్కుకి గొంతుకి కూడా రాసి జోకుడుతుంటే నిద్రలోకి జారుకున్న. పొద్దుటికి  జిందా తిలిస్మాత్ దెబ్బతో జ్వరం గిరం అన్ని బలాదూరు (జిందా తిలిస్మాత్ తో మా ఇంటికున్న అనుభంధం గురించి చెప్తే అది పెద్ద నవలే అవుతుంది.)

పొద్దున్నస్కూల్ కి రెడీ అయి అమ్మ కలిపి ఇచ్చిన గడక చూడగానే టీచర్ గుర్తొచ్చింది. టీచర్ మీద కసి తో నాలుగు ముద్దలు ఎక్కువగానే తిన్నాను.

రోజులు గడుస్తున్న కొద్ది పరిస్థితుల్లో కొంచెం మార్పు వచ్చి తెల్ల రేషన్ కార్డున్నోల్లందరి దగ్గరా రెండ్రుపయాల కంట్రోల్ బియ్యం ఏడెనిమిది రూపాయలకు పట్టు రావడం తో  గడక జాగా లో అన్నం వండుకోవడం మొదలయ్యింది.

ఏంటో రోజులుతో పాటు మార్పుకు గురైన జీవితాలు వాటి తో పాటే పరిస్థితులు ఎంతగా మారిన పెరుగు కలుపుకొని తాగిన ఆ గడక రోజులు ఆ రుచులు  ఇంకా గుండెను వదలలేదు.
ఎలాగైనా ఈ సాయంత్రం ఈ రోజుని ఆ నాటి గడక రుచితో ఆస్వాదించాలి అనుకుంటూ ఆఫీసు లోకి అడుగుపెట్టాను.


Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

2 comments :

  1. చాలా బాగా రాశారు sir ....ఇంకా రాయండి ...

    ReplyDelete
    Replies
    1. sory bhasker adi nen rasindi kaadu...indulo unnavanni na frds rasinavi...vallu rasina vatilooo naku natchinavi ikkada post chesthunna anthey idi rasindi Raghu Mandaati ani fb frnd..:)

      Delete