ఓ తులసి కథ ...(లాస్ట్ పార్ట్ )

కావ్య సహాయంతో తనకి తెలుసున్న గుడిలో మా పెళ్లి జరిగింది . పెళ్లి పెద్దగా కావ్య, మా మనస్సాక్షులు , పురోహితులు ముగ్గురే.

నా మనసుకి నచ్చిన పనిని నేను చేసాను కాని నేనంటూ నిజం చెప్పాల్సింది మా అమ్మకి మాత్రమే. ధైర్యం చాలటం లేదు .అమ్మ ఎప్పటి నుంచో తమ్ముడు దగ్గరకి వెళ్లి ఓ 3 నెలలు ఉండి వస్తానని అంటోంది. నేనే వాయిదా వేస్తూ వచ్చాను పంపిస్తానులే ఏం తొందరని. ఇప్పుడు ఈ విషయం చెపితే ఎలా రియాక్ట్ అవుతుందో. అప్పటినుంచే మొదలు మరో కొత్త జీవితం కోసం నా వాళ్ళకి దూరంగా నిజాల్ని దాచిపెట్టి బ్రతకటం. అనుకున్నట్టుగానే అమ్మని తమ్ముడి ఇంటి దగ్గర దిగపెట్టి వచ్చాను.

గుణరాం మాకోసం వేరే కొత్త ఇల్లు చూసాడు. తెలిసున్న వాళ్ళకి దూరంగా మాకంటూ ఒక్కరు కూడా తెలియని సమాజంలో పాత ముఖాలకి రంగులు పూసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాం . అందరి దృష్టిలో మేమిద్దరం మాకు ఒక పాపా. భవిష్యత్తు ఏమవుతుందో తెలీదు ఇప్పుడు మాత్రం జీవితంలో అన్ని రంగులని ఆనందంగా మార్చి మధురమైన జీవితాన్నే మొదలు పెట్టాను గుణరాం ప్రేమలో.

జీవితంలో మొదటి సారి ప్రేమ ఎలా వుంటుందో , ఆరాధనకి అర్థం ఏమిటో తెలిసింది. నేను ఈయన భార్యనా లేక ఓ ప్రేమ రాణినా తెలిసేది కాదు. ఇంట్లో ప్రతి వస్తువు నా మనసుకి నచ్చి నట్టే వుండేది. డోర్ కర్టెన్ దగ్గర నుంచి తను వేసుకునే డ్రెస్ వరకూ అన్నీ నా ఇష్టాలే. ఇక్కడ నా ఇష్టాలే అనేకంటే తను నన్ను అడిగి నాకు నచ్చిందే చేసేవారు. పాపకి సబంధించి ప్రత్రి చిన్న విషయాన్ని నాకంటే ఎక్కువగా తనే చూసుకునే వారు . స్కూల్ కి దింపడం తీసుకు రావడం, తన అల్లరి భరించడం, హోం వర్క్స్ దగ్గరుండి చేయించడం , తన చిన్న చిన్న కోరికలకి నేనన్నా విసుక్కునే దాన్నేమోకాని గుణరాం చిరునవ్వుతో ఏం కావాలని మరీ అడిగి తీర్చేవారు.

పాప విషయంలోనే అలా వుంటే ఇకా నా విషయంలో తను చూపించే ప్రేమకి ఒక్కొక్క సారి ఆ నింగే హద్దయ్యేది.

పెద్దలు చెపుతారు పెళ్ళైన తరువాత దంపతులకి మూడు రాత్రుల ముచ్చట్లని, మాకు మాత్రం ఏడూ రాత్రులు. "తులసి నాకు పెళ్ళైన తరువాత మొదటి ఏడూ రాత్రులు పరిమళాలను పంచె పూదోటలాంటి పడక గదిలో ఆనందానికే అందని అనుభూతిని పొందాలని ఉంది , అంతెందుకు పడక గదినే పూదోటగా మార్చేస్తాను. ఇదే కదా మనకి జీవితంలో గుర్తుండి పోయే మధుర క్షణాలు " ఈ మాటలు ఈయన అంటుంటే నిజమా కలా అనుకునే దాన్ని.

పెళ్ళైన మొదటి రాత్రంటే మనసులు కలవని రెండు తనువుల సంగమం .మాది మాత్రం మనసులు కలయిక. బిడియం లేదు సిగ్గు సంద్రమై పొంగుకొస్తూంది, వాంఛ లేదు తన యదపై వాలిపోవాలనే కోరిక పెరుగుతూంది . గది బయట నేను గది లోపల తను . ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. మల్లెల వాసన మాత్రం ఇల్లంతా గుబాలించేస్తూంది. రా తులసి తలుపు తీస్తూ తనే సిగ్గు పడుతూ నా కేసి చూస్తూ. మల్లె ఆకారంలో మంచం మీద అలంకరించిన మల్లె పూలు. ఈయన గత జన్మలో వనమాలా ఏమో ఒక్క క్షణం నవ్వొచ్చింది.

నా నడుం చుట్టూ చేయి వేసి కళ్ళతో గది చుట్టూ చూపిస్తూ "తులసి ఎలా ఉంది మొదటి రాత్రి పడక గది అలంకరణ ". కొన్ని కొన్ని అనుభూతులు అనుభవంలోకి వస్తేకాని చెప్పకూడదంటారు.అది ఇదేనెమో ఈయన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. మల్లె పరిమళాల నంతటిని నా పెదవులపై అద్దుకుని ఒక ముద్దివ్వడం తప్ప. అదే చేసాను.

నుదుటపై పెట్టె మొదటి ముద్దు ఆలంబనకి , ఆప్యాయతకి చిహ్నంట. ఈయన పెట్టె మొదటి ముద్దు ఎక్కడ అని తనువు నన్ను అడిగేలోపే నుదుటపై ముద్దు .మా ఇద్దరి అభిరుచులు ఒక్కటే . నా మొదటి ముద్దు అక్కడే కదా ! నాలో నేనే మురిసిపోయాను. తొలి రాత్రి ఒళ్ళు విరుచుకుని మమ్మల్ని తట్టి లేపింది, కళ్ళు తెరచి చూస్తే తెల్ల వారింది. నా కంటే ముందుగా ఈయన వేడి వేడి కాఫీతో రెడీ.

సంపెంగలతో సిగ్గు మొగ్గైన రెండవ రాత్రి,
జాజులతో జాగారం చేసిన మూడవ రాత్రి ,
బొండు మల్లెలతో బారెడు పొద్దెక్కిన నాలుగొవ రాత్రి,
గులాబీలతో వలపు గుబులు రేపిన ఐదవ రాత్రి ,
కనకాంబరాలతో అంబరాన్నంటిన ఆరవ రాత్రి.

ఏడవ రోజు సాయంత్రం పూలసంతలో మేమిద్దరం . ఈరోజేమిటా అని కళ్లెగరేస్తూ చూసాను. ఆగు కంగారు పడకంటూ ఓ పదినిముషాల తరువాత బుట్టనిండా ఆరు రకాల పువ్వులతో సిద్దం. విరహానికే విసుగు పుట్టించేలా ఏడవరాత్రి మాసొంతం .ఈయన ప్రేమతోటే చంపెసేటట్టు వున్నాడు అని నాలో నేను అనుకుని మురిసిపోయే సందర్భాలెన్నో.

ఓ రోజు సాయంత్రం ఆకాసమంతా ముసురు కమ్మిన మేఘం , సన్నటి మంచు ముత్యాలు నింగి అంచుల్లోంచి సంద్రపు ఒడిలోకి రాలుతున్నాయి .ఎప్పటినుంచో ఓ కోరిక. నచ్చిన మనసుతో ఇలాంటి వేళ సంద్రపు ఒడ్డున ప్రేమపక్షుల మవ్వాలని.

తులసి వస్తావా
ఎక్కడకి
రా చెపుతాను
భీములి తీరమంతా మా ప్రేమతో తడిసి ముద్దైంది.

కాలం ఆనందంగా అలా సాగుతోంది .ఆయన నాకు మొదటి సారి కొన్న చీర.షాప్ లోకి తీసుకెళ్ళి నీకు నచ్చిన చీర తీసుకో అన్నారు. మీ మనసు రంగే నాది మీకు నచ్చిందే తీసుకుంటా మీరే సెలెక్ట్ చెయ్యండి అని ఆయనకే వదిలేసాను చాయిస్. ఈ విషయంలో కూడా మా ఇద్దరి అభిరుచులు ఒకటా కదా అని చూసాను . కెంజాయి రంగు చందేరి చీర మీద బంగారపు అంచు నచ్చిందా అంటూ చూపించారు. ఇలాంటి ఆనందాలు ఎన్నో. చూస్తూ చూస్తూ 6 నెలలు గడిచిపోయాయి.

"తులసి నీతో ఓ ముఖ్య విషయం చెప్పాలి . నీకు నచ్చితే ఓకె చెప్పు లేదంటే మానేద్దాం .గుంటూరు కి దగ్గరగా తెలుసున్న బిల్డర్ ఒక లే అవుట్ వేసారు. ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటున్నారు . ఫ్యూచర్ లో మంచి డిమాండ్ ఉన్న లాండ్స్ అవి . ఒక 2 ఇయర్స్ తరువాత అమ్మేసుకున్నా రెట్టింపు మనీ వస్తుంది.మొదట ఒక లక్ష కట్టాలి . 24 నెలలు ఇన్ స్టాల్ మెంట్స్. మంత్లీ 20000 కట్టాలి. నేను సగం నువ్వు సగం వేసుకుందాం. నీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయిస్తాను. కాని తులసి ..."

ఏంటి చెప్పండి అంటూ ఆదుర్దాగా అడిగాను.

ఫస్ట్ కట్టాల్సిన లక్ష నా దగ్గర లేదు . అది నువ్వు అడ్జస్ట్ చేస్తే మిగిలిన వాయిదాలు కలసికడదాం. కాస్త మొహమాటం పడుతూనే అడిగారు.

గుణరాం కన్నా నాకు డబ్బు ముఖ్యం కాదు. తను నాకోసం, బిడ్డకోసమే కదా అడుగుతున్నది . ఆయన నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. మీరు నేను వేరు కాదు , మన మంతా ఒకటి. మీకు నచ్చింది ఏదైనా చెయ్యండి . ల్యాండ్ మీద కదా అంటున్నారు . ఫ్యూచర్ లో ఎపుడైనా మనకి కలిసి వచ్చేదే. ల్యాండ్ మీద మీ పేరే పెట్టండి , నా పేరు మీద పెట్టింది ఏదీ కలిసి రాలేదు. నాకు ఇంతటి జీవితాన్ని ఇచ్చిన ఆయన మొదటి సారి నన్ను అడిగింది ఎలా కాదనగలను. మరుసటి రోజు మనీ అయన చేతికి ఇచ్చాను.

ఆడది ఎంత చదువుకున్నా, ఎన్ని తెలివి తేటలు ఉన్నా తన అనుకున్న వాళ్ళని గుడ్డిగా నమ్ముతుంది, బహుసా నేను అదే చేసానేమో. 2 సంవత్సరాలు ఇట్టే గడిచి పోయాయి, ఆయన ప్రేమలో స్వార్థం లేదు నాకు అనుమానం లేదు . ప్రేమ రోజు రోజుకీ పెరుగుతూ వచ్చింది . నెలలో ఓ రెండు రోజులు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకి వెళ్లి వచ్చేవారు . నాకు వాళ్ళని చూడాలని అనిపించేది . ఈయన పరిచయం చేసేవరకు అడగకూడదని సైలెంట్ గా వుండేదాన్ని.

ఒక రోజు హడావిడిగా వాళ్ళింటికి వెళ్లారు. ఎప్పుడు వెళ్ళినా రెండు రోజుల్లో వచ్చేసేవారు. వారమైనా ఇంటికి రాలేదు ,ఒక్క కాల్ లేదు . వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకి వెళితే తను కాల్ చేస్తే కాని నన్ను కాల్ చేయద్దనే వారు . నెక్స్ట్ డే ఆఫీసులో వుడంగా కాల్ వచ్చింది .

తులసి ఎలా వున్నావ్

నేను పాపా బావున్నాం, మీరేంటి ఇన్ని రోజులు వున్నారు.

ఏం లేదు నీకు గతంలో చెప్పాను కదా , మాకు ఒక ఉమ్మడి ఆస్తి ఉంది. ఆ హౌస్ కోసం మా నాన్న, చిన్నాన్నల మధ్య గొడవ పెరిగింది. ఇన్నాళ్ళు ఆ ఇంట్లో మేమే ఉంటున్నాం, ఆ ఇల్లు మమ్మల్నే తీసుకోమన్నాడు. అది కాస్త కొంచం పరువు సమస్యగా మారింది. ఇప్పుడు ఆ ఇల్లు మేమే కొనుక్కోవాలి. ఒక 7 లక్షల ఇస్తే ఆ ఇల్లు మాకే ఇచ్చేస్తాం అంటున్నాడు మా చిన్నాన్న. మా దగ్గర 2 లక్షలే వున్నాయి. ఎలాగయినా ఇంకో 5 లక్షలు అడ్జస్ట్ చేస్తే ఆ హౌస్ మన సొంత మవుతుంది . దాని వేల్యూ 20 లక్షలు పైగా వుంటుంది. సో ...

చెప్పండి.

నువ్వు ఎలాగైనా ఆ అమౌంట్ అడ్జస్ట్ చేస్తే , ఒక 6 నెలల్లో మన గుంటూర్ లో ల్యాండ్ , ఈ హౌస్ కలిపి అమ్మేసి వైజాగ్ లో ఓ ఫ్లాట్ కొనుక్కుందాం . అందరూ కలసి ఒకే చోట ఉండచ్చు. ఈ లోపులో అమ్మ నాన్నకి కూడా మన విషయం చెపుతాను .

మీరు కంగారు పడకండి , నేను అర్థం చేసుకోగలను. కాని అంత డబ్బు నా దగ్గర కూడా లేదుగా అదే ఆలోచిస్తున్నాను.

తులసి బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకుంటే నీకు ఇస్తారు . వన్ మంత్ లో మనీ అరేంజ్ చేస్తే మన ప్రొబ్లెమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. తరువాత హ్యాపీ గా ఉండచ్చు. నాకు వేరే ఛాయస్ కూడా లేదు . నువ్వే ఎలాగైనా సర్దాలి. నేను ఒక 2 డేస్ లో ఇంటికి వస్తానని కట్ చేసారు కాల్.

ఇన్నాళ్ళు గుణరాం నా మీద చూపించిన ప్రేమ ముందు తను చెప్పేది నిజమో కాదో అర్థం కాలేదు. నమ్మకం తానంటే చెప్పలేనంత పిచ్చి నమ్మకం .ఒక 6 నెలల్లో వైజాగ్ లోనే కొత్త ఇల్లు కొనుక్కుని అందరం ఒకే చోట ఉందాం అనే తన మాటమీద నాకు చాలా నమ్మకం కలిగింది. తెలుసున్న వాళ్ళ ద్వారా బ్యాంకులో పర్సనల్ లోన్ పెట్టి 5 లక్షలు ఇచ్చాను. 4 రోజుల్లో ఇంటి గొడవ సెటిల్ చేసుకుని వస్తానని చెప్పి వెళ్లారు .

వారం రోజులు గడిచాయి, రెండు వారాలు వెళ్లి పోయాయి, కాల్ చేద్దామంటే మొబైల్ స్విచ్ ఆఫ్. ఆయన పనిచేసే ఫార్మా కంపెనీ కి వెళ్లి అడిగితె జాబు రిజైన్ చేసి వెళ్ళిపోయారు 2 వీక్స్ బ్యాక్. కంపెనీ లో తెలిసున్న వాళ్ళ ద్వారా ఆయన డీటెయిల్స్ అడిగితే తిరుపతి అని తెలుసు అంతకు మించి ఏం తెలీదు.

నా పెళ్ళైన తరువాత కావ్య వేరే చోటుకి ట్రాన్సవర్ అయ్యింది, అప్పటి నుంచి తనతో పెద్ద టచ్ లేదు . ఈ మనీ విషయాలు కూడా తనతో ఎప్పుడూ చెప్పలేదు. ఎవరకి చెప్పాలి నా భాదని . నాకు తెలుసున్న వాళ్ళ దగ్గర నాకు పెళ్లి కాలేదు. తెలియని కొత్త ప్రపంచంలో గుణరాం నా భర్త. గుణరాం తో పెళ్ళైన 4 నెలలకి తమ్ముడికి ఈ విషయం తెలిసి నాతో మాట్లాడటమే మానేసాడు. తనకి చెపితే తను చూసే చూపులు నేను తట్టుకోలేను. ఆఫీసులో తెలిసున్న వాళ్ళ ముందు కష్టం చెప్పుకుందామన్నా ఇన్నాళ్ళు నేను దాచి పెట్టిన రహస్యానికి వాళ్ళ ముందు ముద్దాయిగా నిలబడాలి. పాపకి నాకు బ్రతుకు తెరువైన ఈ జాబు కూడా ప్రాబ్లంలో పడే అవకాశం ఉంది.

కాలం నా సహనానికి పెట్టిన అతిపెద్ద పరీక్ష. చూస్తూ చూస్తూ 6 నెలలు గడిచిపోయాయి . మళ్లీ ఒంటరితనం నాచుట్టూ ఎందరున్నా ఎవరూ లేని శూన్యం. ఓ రోజు సెలవు పెట్టి కావ్య దగ్గరకి వెళ్ళాను . జరిగిన విషయం మొత్తం చెప్పేటప్పటికి తనకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు . తన వల్లే ఇదంతా జరిగిందని, తనని క్షమించమని అడిగింది. కంగారు పడకు తిరుపతిలో నాకు తెలుసున్న వాళ్ళ ద్వారా నేను కనుక్కుంటానని ధైర్యం చెప్పి పంపించింది.

రోజులు ఇలాగే గడిచిపోతున్నాయి, ఓ రోజు కావ్య దగ్గర నుంచి కాల్ . తులసి నువ్వు గుణరాం గురించి ఇక మర్చిపో, తెలిసున్న వాళ్ళ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే తనకి నీ పరిచయం కంటే ముందే పెళ్లైంది, ఇద్దరు అమ్మాయిలు కూడా. తన వుండే ప్లేస్ అన్ని నాకు తెలిసాయి. కాని మనం ఏం చేసినా పోయేది మన పరువే. నిన్ను మోసం చేయటానికే నీతో పరిచయం పెంచుకున్నాడేమో, ఇంకొన్ని రోజులు నీతోనే వుంటే ఇంకెన్ని మోసాలు చేసేవాడో. చాలా పూర్ ఫ్యామిలిట తనది , పైగా ఇద్దరు ఆడపిల్లలు. అందుకోసమే నీతో ప్రేమ నాటకం ఆడి దండుకున్నంత డబ్బులు దండుకుని వెళ్ళిపోయాడు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, తనని నువ్వు బాగా ఇష్టపడ్డావని తెలుసు.మళ్లీ ప్రేమతో పిలుస్తావేమో వద్దు, చూసి చూసి ఎవరైనా పాముల పుట్టలో వేలు పెట్టలేం కదా . నేను నిన్ను త్వరలో కలుస్తాను, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. తను చెప్పదలుచుకున్నది చెప్పి ఫోన్ పెట్టేసింది.

ఇప్పుడు నాకు బాధ లేదు, కళ్ళలో కన్నీరు లేదు. నామీద నాకే జాలి అసహ్యం వేస్తూంది. ఇది నా అంతటనేను చేసుకున్న తప్పు. ఇందుకు పూర్తి భాద్యత నాదే. మనసుకో తోడూ కోసం ఉన్న బంధాలని వదులుకున్నాను, నిజాన్ని దాచాను. అగ్ని సాక్షిగా పెళ్ళాడిన శ్రీనివాస్ బ్రతుకు మీద గాయం చేసాడు, మనస్సాక్షిగా పెళ్ళాడిన గుణరాం మనసు మీద గాయం చేసాడు. ఇద్దరి దగ్గర బలైంది నేనే. తెలిసున్న సమాజం దగ్గర నిజాన్ని చెప్పి లోకువవ్వలెను , తెలీని సమాజానికి నా గోడు చెప్పుకుని ఎగతాళి కాలేను . బ్రతుకు మీదే అసహ్యం వేస్తూంది. మరి నా చిట్టి తల్లి హరిత సంగతి ఏంటి ?

గుణరాం చేసిన తప్పులన్నీ మర్చిపోయి మళ్లీ తనని పిలుద్దామంటే ? నాకంటే ముందు అతను వేరొకరి సొంతం, తెలియక అతని ప్రేమని పొందాను, తెలిసి తన ప్రేమని దొంగిలించలేను. గుణరాం నా శరీరాన్ని చూసాడే తప్ప మనసుని చూడలేదు. తన రక్త బంధాల కోసం నన్ను వాడుకున్నాడు, అవసరం తీరింది వెళ్ళిపోయాడు. నాకు నన్నుగా చూసే సొంతమైన ప్రేమ కావాలి,కల్మషం లేని ప్రేమ కావాలి.అలా ఇవ్వగలిగేది నా కూతురే. జీవితం నాకు నేర్పిన అతి పెద్ద గుణపాఠం ఇప్పటి వరకు నే గడిపిన జీవితం. ఒక పరిధిదాటి ఎవ్వరికి మనసులో చోటు ఇవ్వకూడదు గుడ్డిగా నమ్మకూడదు. ఓడిన జీవితమే అనుభవాలు చెపుతుందేమో , ఓ బ్రతుకు పాఠం నేర్పుతుందేమో . విధికి బలైన విగతజీవిని సహనం కోల్పోని స్త్రీ మూర్తిని నేనే . వీళ్ళందరికి దూరంగా తెలీని ప్రపంచంలోకి పారిపోవాలి. నా కూతురు కోసమే బ్రతకాలి.

తులసి :- బాటసారి మీకు నా జీవితం గురించి చెప్పాలనిపించి చెప్పాను. ఇది చదివిన వారు కొందరు నా మీద జాలి పడచ్చు , కొందరు తగినశాస్తి జరిగిందని నవ్వుకోవచ్చు. కాని కొందరైనా ముఖ్యంగా నాలాంటి జీవితం గడిపే నాతోబుట్టువు ఎలా ఉండకూడదో తెలుసుకుంటే చాలు. నా పాపతో నేను సంతోషంగానే ఉన్నా గత జీవిత మరకలు పడకుండా దూరంగా ఆనందంగా.

బహుదూరపు బాటసారి
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment