likeలూ, updates, రిక్వెస్ట్ లు.. చాలా పెద్ద జీవితం!

likeలూ, updates, రిక్వెస్ట్ లు.. చాలా పెద్ద జీవితం!

కళ్లెదురు కంప్యూటర్ మోనిటర్..

ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నామా అంటే.. అదేం కాదు!

దృష్టంతా తదేకంగా ఫేస్ బుక్ streamని గమనిస్తోంది..

ఎందరివో ఎన్నో ఎమోషన్లు మనకు తెలియకుండానే సబ్-కాన్షియల్ మైండ్ లోకి చేరిపోతూ అస్థవ్యస్థపు గురుతుల్ని మనసులో ముద్రించిపోతుంటాయి.

కొందరు దేశాన్నీ, రాజకీయ నాయకుల్నీ, వ్యవస్థనీ, సినిమాల్నీ, మనుషుల్నీ, అమ్మాయిల్నీ, అబ్బాయిల్నీ, క్రికెట్ నీ.. వేటివేటినో తిడుతుంటారు.. మరికొందరు సరిగ్గా వాటినే నెత్తికెక్కించుకుంటూ ఉంటారు. ఇలా రకరకాల updatesని చూడ్డం ఆలస్యం "ఫలానా విషయంలో మనకూ ఓ అభిప్రాయం ఉంది కదా.." అని మనసు దాన్ని బయటపెట్టడానికి ఉవ్విళూరుతుంటుంది.

ఎవరో ఉద్రేకంగా ఎవర్నో తిడుతున్నారు.. అలా తిట్టడం మనకు నచ్చట్లేదు. పనులన్నీ మానుకుని "మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు.. ఇలా ఆలోచించి చూడండి" అంటూ సలహాలు కుమ్మరించేస్తాం. అవతలి వ్యక్తి వింటే మన అహం సంతృప్తి చెందుతుంది. వినకపోతే, ఎదురు తిరిగి మనల్నీ తిడితే.. ఇక మన విచక్షణనీ మర్చిపోయి మనమూ అట్టడుగు స్థాయికి దిగజారిపోతాం.

మరోవైపు ఎవరో తమ విజయాలు, తమ కార్యక్రమాల గురించి బహిరంగంగా చెప్పుకుంటూ ఉంటారు. "ఎంత గొప్పలు చెప్పుకుంటున్నారో.. వీళ్లే దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లు బోడి ఫోజులు" అంటూ మనలో తెలీకుండానే ఓ తిరస్కారభావం వేళ్లూనుకుంటుంది.

మన ఫ్రెండ్స్ లో ఎవరో ఏదో like కొడతారు.. అదేంటో పనిమాలా చూస్తాం, బాగుందనుకుంటే మనమూ like కొడతాం, బాలేదనిపిస్తే మన ఫ్రెండ్ కి అదెలా నచ్చిందా అని ఓ రెండు నిమిషాలు తీరిగ్గా విశ్లేషించి ఓ నవ్వు నవ్వుకుని మళ్లీ ఇతరుల్ని గమనించడంలో నిమగ్నమవుతాం.

ఎక్కడో ఏదో కొటేషన్ బాగుంటుంది.. ఏదైనా బాగుంటే ఆచరిస్తే చాలా హాపీ. కానీ మనం ఆచరించకపోయినా మనకు ఆచరించే హృదయం ఉందన్న ముసుగులో బ్రతికేయడానికీ, మనం నిజంగానే ఆ మానసిక పరిణతిని కలిగి ఉన్నామని బయటి ప్రపంచానికి చాటిచెప్పడానికీ సింపుల్ గా ఓ like కొట్టేస్తే సరిపోతుంది. "ఓ ఫలానా మనిషి ఫలానాని ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ మనిషి అలాంటి వారై ఉంటారు" అని ప్రపంచం నమ్ముతుందని మన ఫీలింగ్, మనమూ పట్టుబట్టి అంత కఠిన జీవిత నియమాలు ఫాలో అయినా అవకున్నా నిజంగా దగ్గరకొచ్చి "మొన్న Facebookలో అలా రాశావు కదా, దాన్ని like కొట్టావు కదా, నిజంగానే అలాగే నీ మెంటాలిటీ ఉందా" అని టెస్ట్ చేసేవారు ఎవరూ ఉండరు కాబట్టి ఢోకా లేదు.

మన ఆలోచనలు మన చేతుల్లో లేవు, మన ఎమోషన్లు మన నియంత్రణలో లేవు, టివి ఛానెళ్లు ఇప్పటికే మనల్ని సగం మింగేశాయి, ఇప్పుడు వాటికన్నా ఎక్కువ గంటల తరబడి Facebook streamనీ, updates, కామెంట్లు, likeలను గమనిస్తూ మనల్ని మనం కోల్పోతున్నాం.

ఓసారి కళ్లు మూసుకుని అసలు తామేంటీ, తమకు కావలసిందేంటీ, తాము వర్చ్యువల్ ప్రపంచంలో ప్రవర్తిస్తున్నది ఎలా, అస్సలు ఎంతవరకూ ఆ చెత్తాచెదారాన్ని మనసులోకి తీసుకోవాలి వంటివి ప్రవాహంలో కొట్టుకుపోకుండా విశ్లేషించుకోగలిగితే ఎంత సులభంగా డిటాచ్ అవ్వొచ్చో!

మనకు పనేం లేకపోతే ఫర్వాలేదు.. ఎవరో ఎక్కడో కామెంట్ పెడితే దాన్ని చూసి మనం పనులన్నీ మానుకుని అక్కడికెళ్లి చూస్తున్నామంటే మన స్వంత పనుల్ని ఎంత విస్మరిస్తున్నాం? నాకు తెలిసి ఇది చదివాక దీన్ని like చేయడానికీ, కామెంట్ పెట్టడానికి కూడా చాలామంది వెనుకాడతారు. :) కానీ ఎవరు ఔనన్నా కాదన్నా ఇది వాస్తవం.

ఏ అందమైన అమ్మాయి ఫొటోనో, ఏ గాసిప్ నో, ఏ పనికిమాలిన ఆర్గ్యుమెంట్ నో, ఏ కుళ్లు జోక్ లనో గుడ్డిగా ఫాలో అయిపోతూ గంటల్ని క్షణాలుగా ఖర్చుచేయడం మనకొక్కళ్లకే సాధ్యమవుతున్నందుకు గర్వపడాలి.

భారతదేశానికేం.. లెక్కలేనంత man power ఉంది.. అంటూ గొప్పగా చెప్పుకుంటాం. ఆ man powerలో మనమూ భాగమేనా? మనమూ భాగమైతే మనం దేశానికి గర్వకారణం అయితే బాధ్యతగా ఇంత అలవోకగా కాలక్షేపం చెయ్యగలమా?

మన ఆలోచనల్ని, ఎమోషన్లనీ హైజాక్ చేసి పారేసి, కొన్నాళ్లకు ఆలోచించే శక్తినే నిర్వీర్యం చేసేసే టెక్నాలజీ కన్నా కడుపునిండా కూడుపెట్టే వ్యవసాయం మేలేమో!

వర్చ్యువల్ ప్రపంచపు ప్రవాహంలో కొట్టుకుపోతూ మనల్ని మనం కోల్పోకుండా ఉందాం..

ధన్యవాదాలు

గమనిక: ఇది వ్యక్తిగత స్థాయి విశ్లేషణ కోసం రాసిందే తప్ప ఎవరి నడవడికలను ఎత్తి చూపించడానికి కాదు. సహృదయంతో అర్థం చేసుకోగలరు.

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment