ఓ తులసి కథ ...(పార్ట్-2)

ఓ తులసి కథ ...(పార్ట్-2)

అదే మొదటి సారి తులసి అతని కళ్ళల్లోకి చూడటం, భాద్యతలతో పోరాడుతున్నాను అన్నట్టుగా చెల్లా చెదురుగా నలిగిన జుట్టు , ఆరాధనగా చూస్తున్న కళ్ళు , ముక్కు సూటి మనిషికి సింబాలిక్ గా అన్నట్టు సన్నటి పొడుగాటి ముక్కు, కొంచం పెరిగిన గడ్డం , ఎర్రటి ఛాయా మొత్తానికి మధ్య తరగతి మనిషికి కేర్ అఫ్ అడ్రస్ లా వున్నాడు. రాజీ కుదరని అభిప్రాయంతో కొంచం సందేహంగా ఆదర్శం అంటే అని ధైర్యం చేసి అడిగింది సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ. .....

ఒక్కసారి తులసి కళ్ళలోకి చూస్తూ అలా ఉండిపోయాడు ,ఆదర్శం అంటే అంటే .....కొంచం తడబడుతూ మీరు అలా సడన్ గా అడిగితే ఏం చెప్పాలో తెలియటం లేదు.

పరవాలేదు చెప్పండి ఈ సారి కొంచం ధైర్యంగా అడిగింది

మీకు బ్లూ కలర్ అంటే ఇష్టమా?

ఇష్టం కాబట్టే కట్టుకున్నా

ఏం లేదు ..ఈ బ్లూ శారీ లో మీరు అందంగా వున్నారని చెప్పను, మీకు ఈ శారి బాగుందని చెప్పను . కాని బ్లూ కలర్ కే మీరు అందం తెచ్చారు అది మాత్రం చెప్పగలను . కొంచం చనువుగా టాపిక్ మార్చుదామని ప్రయత్నిస్తున్నాడు.

పొగిడింది చాలు, విషయం చెప్పండి .తన మాటల్లో ఏం చెపుతాడో వినాలనిపించింది. చాల రోజుల తరువాత తనను పొగిడిన ఆనందం కళ్ళలో కనపడకుండా దాచేస్తూ.

అంటే డబ్బుకి కాకుండా మనవ సంబంధాలకి విలువిచ్చే అమ్మాయ్, కొంచం సేవా భావం వుండాలి . పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాలి.

తులసికి గుణరాం మాటలు అర్థం అవుతున్నాయ్ , తను చెప్పదలుచుకున్నది ఒకటి, చెపుతున్నది మరొకటి. ఏదో చెప్పలేక కష్టపడుతున్నాడు అని " మా ఆడవాళ్ళు మీ కంటే ఎక్కువగా అర్థం చేసుకుంటారు, ఆ విషయం లో మీరు ఆలోచించక్కర్లేదు. మరి మీరు అనుకునే ఆదర్శం ఏంటి చెపుతారా? " కొంచం సీరియస్ గానే అడిగింది అతని మనసులో మాట తెలుసుకుందామని .

తులసి కళ్ళల్లోకి సూటిగా చూడలేక పోతున్నాడు , టేబుల్ పైనున్న టీకప్ వైపే అతని చూపులు. నెమ్మదిగా గొంతు సవరించుకుని చూడండి మీరు మరోలా అనుకోకూడదు మీ పరిచయం తరువాత తీసుకున్న నిర్ణయం కాదు, చిన్నప్పటినుంచి నేను చాల సంఘసంస్కర్తల జీవిత చరిత్రలు చదివాను, సో........

సో చెప్పండి , తను ఏమంటాడో ముందుగానే ఊహించినట్టుగా తులసి కళ్ళు చెప్పకనే చెపుతున్నాయ్

నేను ఒక విడోని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను తులసి గారు

ఆ మాట అనే లోపే తులసి కళ్ళల్లో నీళ్ళు తిరగడం మొదలయ్యాయి. తిను నా పరిస్థితి తెలిసి నా జీవితంలోకి కావాలని వస్తున్నాడా లేక నిజంగా ఇంతటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తా లేక నాపై జాలితో ఈ మాటలు అంటున్నాడా ఇలా ఎన్నో సందేహాలు. ఒక్క క్షణం మౌనంగా గుణరాం కేసి చూసి వెళ్ళిపోయింది . పిలుస్తున్నా పట్టించు కోకుండా.

తులసికి ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు, తనకి సంతోషమొచ్చినా బాధ కలిగినా సంద్రపు ఒడ్డే తన ఓదార్పు , వచ్చి పోయే అలలతోనే తన ఊసులన్నీ చెప్పుకుంటుంది .చాల సేపు అలాగే బీచ్ లో సముద్రాన్ని చూస్తూ ఉండిపోయింది. ఎప్పుడు బీచ్కి వెళ్ళినా తనకి సముద్రుడు నేనున్నాననే ఓదార్పు నిస్తాడు , ఈ సారి ఆ ఓదార్పు లేదు కదా ఏదో తెలీని అనిస్థితి . సూరీడు పడమటి దిక్కుకి వాలిపోతున్నాడు , మసక చీకటితో పోటీ పడుతూ తనలోని మానసిక సంఘర్షణని రెట్టింపు చేస్తూ కెరటాల ఘోష కూడా ఎక్కువైంది .

"మేడం మేడం పల్లీలు కావాలా" ఒక్కసారి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది తులసి , అదే మొదటి సారి తన లైఫ్ లో తనని తాకిన ఏ కెరటం ఓదార్పు నివ్వకపోవడం, టైం చూస్తే 7.30, కంగారుగా బస్ కోసం పరుగులు తీసింది .

ఇంటికి రాగానే బెడ్ మీద వాలిపోయింది. మమ్మీ అని దగ్గరకి వచ్చిన తన 9 ఏళ్ల కూతురు హరితని దగ్గరకు తీసుకుని గుండెలకి హత్తుకుంటూ. అమ్మ వచ్చే వరకు నిద్రని ఆపి అమ్మని చూడగానే ఒక్కసారి నిద్రలోకి జారుకుంది చిన్నారి తల్లి.

ఏం తినాలనిపించటం లేదు , గుండెల్లో తెలీని అలజడి. కొత్త బంధాల కోసం మనసుకీ ఊగిసలాట ఎందుకో అర్థం కావటం లేదు . తనలో తనకే తెలీని ఓ కొత్త వెలితి . నేను, పాపా, మా ఇద్దరికీ తోడూ మా అమ్మ .ఇది చాలదా నా జీవితం ఇంతేనని తెలిసి కూడా ఇంకా ఎందుకు ఏదో కోల్పోతున్నాననే బాధ .కళ్ళలోంచి తెలీకుండానే నీళ్ళు వస్తున్నాయ్ . మనిషిని పలకరిస్తారు తప్ప మనసుని పలకరించే వారు ఒక్కరూ లేరు . చూస్తూ చూస్తూ జీవితంలో పది సంవత్సరాలు అయిపోయాయి , అందరి జీవితాలలో పెళ్లి ఓ కొత్త మలుపు, మనిషికో తోడు, నా జీవితంలో మాత్రం అడుగడుగునా అగాధాల వెతలే.

నాన్న నాకు ఇష్టం లేదు పెళ్లి అన్నా తన మాట వినిపించుకోలేదు . మంచి సంబంధం, అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు నీకు ఇంకేం కావాలి? కనీసం నన్ను అడగకుండా సంబంధం ఖాయం చేసుకుని వచ్చాడు నాన్న . జీవితంలో చాలా విషయాలలో సర్దుకు పోయాను . తమ్ముడి సంతోషాల కోసం ఎన్నో త్యాగాలు చేయమనేవారు . ఇంజనీరింగ్ చదువుతాను అంటే వద్దమ్మ తమ్ముడిని నిన్ను ఒకసారి చదివించలేం , ఎలాగో పెళ్లై వెళ్లి పోయేదానివి కదా నువ్వు డిగ్రీ చదువు .తమ్ముడి కోసం అలా రాజీ పడటం మొదలైంది, తరువాత రాజీలతో అలవాటు పడటం మొదలైంది. అప్పటినుంచి జీవితమంతా రాజీలే , ఇప్పుడు ఈ పెళ్లి అంతే. మాఅమ్మ మానాన్న దగ్గరకి నాలానే వచ్చింది , సర్దుకుపోయి సంతోషంగానే వుంది కదా. నేను అలాగే వుండాలి, ఉండాలేంటి ఉండితీరాలి. ఆడదాని జీవితమింతే, నేను అదే జీవిత సంద్రంలో ఓ కెరటాన్నే కదా ...

పెళ్ళైన మూడో రోజునే తెలిసింది తన భర్త శ్రీనివాస్ కి తాగుడు అలవాటుందని . అమ్మ చెప్పిన రాజీ జీవితం మళ్ళి ఇక్కడ మొదలైంది అని నాలో నేనే మనసులో నవ్వుకున్నా . డ్రింక్ చేసేవారంటే ఎంతో చిరాకు పడేదాన్ని , మా నాన్నని సైతం తిట్టేదాన్ని . ఇక్కడ భర్త గౌరవం కాపాడాలంటే నేను మౌనంగా వుండాలి . ఎక్కువగా మాట్లాడే వాడు కాదు , ఏదైనా అవసరం ఉంటే పలకరించేవాడు . అప్పుడప్పుడూ నవ్వుకునే దాన్ని ఇతను నాకు భర్తేనా అని. పెళ్ళైన మొదట్లో తనతో ఓ రెండు సినిమాలు చూసాను . తరువాత ఆఫీసు బిజీ అంటూ ప్రతి రోజు ఆయన ఇంటి కొచ్చే టైం రాత్రి 11. రోజు ఇంత లేట్ ఎందుకని అడిగితే మగాడికి బోలెడన్ని పనులుంటాయ్ ఇంకెప్పుడూ అడగద్దు అని ఒకటే సమాధానం . కోరిక వస్తే తన అవసరం తీర్చడం, ఇంటి పని చేయడం ఇదే రోజులో నాకు తెలిసింది .

కొన్నాళ్ళు ఈయన నిజంగా బిజీనేమో ఆఫీసులో అనుకుని నమ్మేసే దాన్ని.కొంత కాలనికి ఆ విషయమే మర్చిపోయాను.పెళ్ళైన తరువాత భర్త భార్యకి ఇచ్చే అతి పెద్ద గుర్తు పిల్లలే కాదా. ఈ మనిషి నన్ను తల్లిని చేసాడు . మొగుడు అనాలనిపించ లేదు నాకు . ఈయన ఎప్పుడు అలా ప్రవర్తించలేదు.

" కడుపుతో ఉన్నావ్ కదా పుట్టింటికి వెళ్ళిపో, ఇక్కడ ఏం పని చేస్తావులే .మీ అమ్మ నాన్నకి నేను ఫోన్ చేసి చెపుతాను" చాల ప్రేమగా దగ్గరకొచ్చి మొదటిసారి.నాతో అన్న మాట. చాల చిత్రంగా అనిపించింది ఇదంతా ప్రేమేనా అని . ఆయన కళ్ళలో ఉన్న ఉద్దేశం నాకు తెలుస్తూంది .

నవ్వాలో ఏడవాలో తెలీదు. ఇంకా నాకు నాలుగు నెలలే అండి అప్పుడే వెళ్ళిపోమంటున్నారు అని నేను జాలిగా అడిగిన మాట ఆయన చెవిని చేరనే లేదు . మా నాయనమ్మ చెప్పేది కడుపుతో ఉన్న భార్య భర్త దగ్గర వుండాలని కోరుకుంటుందట. నే చెప్పే ఈ మాట వినకుండానే ఏదో పనుందని వెళ్లి పోయారు .
అమ్మ నాన్న రావడం నన్ను తీసుకెళ్లడం కూడా జరిగిపోయింది . ఎప్పుడో నెలకి ఫోన్ ఎలా వున్నావని? అదీ పలకరించక పోతే బావోదని .రండి ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉంది అంటే ఖాళీ లేదనే సమాధానం .అందరి భర్తలు ఇలానే ఉంటారా,నా భర్త వేరా ? తెలిసేది కాదు . అమ్మని అడిగేదాన్ని . కడుపుతో వున్నావ్ ఎక్కువ ఆలోచించకు అని మాట దాటవేసేది.

నాకు మరో జన్మ. పాప పుట్టింది .చూడటానికి వచ్చారు ఏదో తప్పదు అన్నట్టు . ఈయన మొహంలో కాని అత్తా మామల మొహంలో కాని ఆనందమే లేదు . వచ్చారు వెళ్లి పోయారు .

కార్యేషు దాసీ ఈ మాట నా కోసమే కనిపెట్టారేమో . మళ్లీ అత్త వారింటికి ప్రయాణం .నాకు ఒకే ఒక్క తోడు నా కూతురు హరిత . చూస్తూ చూస్తూ పెళ్లై రెండు సంవత్సరాలు అయిపొయింది . ఎప్పుడైనా బుద్ది పుడితే పాపతో ఆడుకునే వారు లేదంటే ఆఫీసు బయట ఫ్రెండ్స్ . మా ఇద్దరి మధ్య రాను రాను దూరం పెరుగుతోంది , కొత్తలో కనీసం ఒక్క సారైనా ఎలా ఉన్నవని పలకరించేవారు , ఇప్పుడు అది కూడా లేదు . నాకు కోరికలుంటాయని అయన మర్చిపోయారో ఏమో !

ఎంతైనా ఆడదాన్ని కదా కాస్త అనుమానం నాలోనూ తొంగి చూసింది . అర్థ రాత్రిళ్ళు రావడం నన్ను పూర్తిగా పక్కన పెట్టడం . మొదటి సారి అత్తింటి గుట్టుని పుట్టింట్లో చెప్పాను. మధ్య తరగతి బ్రతుకుల్లో మొదట సమస్యకి పరిష్కారంకంటే ఏడవటమే ఎక్కువ . అమ్మ నాన్న బాధ పడ్డారు.తమ్ముడిది నా వయసు కదా ఆవేశంతో ఊగిపోయాడు .

కొన్నాళ్ళకి తెలిసింది పెళ్ళికి ముందే ఈయన జీవితంలో వేరొక స్త్రీ ఉందని . మొదటి సారి తెలిసింది స్త్రీ జీవితమంటేనే రాజీ అని . తనతో కొన్నాళ్ళు మాట్లాడ లేదు .ఎక్కడికైనా వెళ్లి పోవాలనిపించింది . ఎక్కడికి పోను? నా మనసుకో తోడూ లేకపోయినా పాపకి నాకు ఆయనే దిక్కు. సంఘంలో ఓ గౌరవం . ఒంటరిగా బ్రతికే కంటే ఇలాంటి రాజీ జీవితమే గౌరవం అని అమ్మ చెప్పిన మాటలు . లైఫ్లో ఫస్ట్ టైం ఆయనఃతో కోపంగా గుండెల్లో పొంగుకొచ్చే బాధని కళ్ళల్లో చూపిస్తూ మొదటి సారి అన్నమాట " ఇకనైనా కనీసం పాప మొహం చూసైనా మారండి , నే వెళ్లి పోవటం ఒక్క నిముషం పట్టదు.భర్త అని మీ విలువ కోసం నేను మీతో ఉంటున్నాను "

"సారీ" ఇలాంటి తప్పు మళ్లీ చేయను. నాకేసి చూడకుండానే వెళ్లి పోయారు . కొన్నాళ్ళు మా మధ్య మాటలు లేవు .నా చిట్టి తల్లి ముద్దు ముద్దు మాటల తోనే రోజంతా గడిచిపోయేది. తనే లోకం నాకు . ఎప్పుడైనా నన్ను పలకరిస్తే కళ్ళతోనే సమాధానం చెప్పేదాన్ని. కాలం కరిగిపోతూంది నా చిట్టి తల్లి మాటల్లో ఒదిగి , చూస్తూ చూస్తూ హరితకి మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఒకటే జీవితం పెద్దగా మార్పేమీ లేదు.నాకు అమ్మ చెప్పిన మంచి మాట పదే పదే గుర్తొచ్చేది. . మనం ఎవ్వరిని మార్చలేం వాళ్ళంతట వాళ్ళే మారాలి . మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి . ఇల్లాలిగా నేను ఆయన విషయం లో ఎప్పుడూ పద్దతిగానే వున్నాను. ఆ దైవం నా మీద జాలి తలచిందో ఏమో ఈయనలో మార్పు రావడం మొదలైంది . బయట తిరుగుళ్ళు మానేసి వేళకి ఇంటికి రావడం మొదలు పెట్టావారు . పెళ్ళికి ముందు ఉన్న తన పరిచయాన్ని పూర్తిగా వదిలేసారు. పాపతోనే ఎక్కువ సమయం గడిపేవారు. ఇంక ఆ త్రాగుడు కూడా మానేస్తే మళ్లీ నా జీవితంలో మంచి రోజులు వచ్చి నట్టే .

తులసి నీకు నచ్చి నట్టుగా ఉండటానికి నాకు కొంచం టైం కావాలి . ఈ త్రాగుడు కూడా మానేస్తాను అంటూనే త్రాగే వారు . నాకు సహనం ఒక్కటే మార్గమైంది.

ఓ రోజు ఆఫీసు నుంచి కాల్ వచ్చింది . మీరు అర్జెంటు గా రావాలని.......?

బహుదూరపు బాటసారి
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment