ఓ తులసి కథ ...(పార్ట్-4)

ఓ తులసి కథ ...(పార్ట్-4)

నా ఒంటరితనం నాకు ఎలాగూ అలవాటయ్యింది, ఎందుకొచ్చిన ఈ కొత్త బంధాల కోసం వెంపర్లాట అనుకుంటూ నా పనిలో నేను లీనమయ్యాను. ఇంతలో హలో యు గాట్ అ మెసేజ్ అంటూ మొబైల్ inbox లోంచి చిన్న సందేశం గుణరాం నుండి. " హలో తులసి గారు ఎలా ఉన్నారు? నేను ఏవిషయాన్ని సిరియస్ గా తీసుకొను. తీసుకుంటే సరదాగా అనను. నిన్న మీతో చెప్పిన నా మాటలన్నీ నిజాలే. మీ మనసు నొప్పించి ఉండొచ్చు. కాని నా ఆదర్శం మాత్రం మీ మనసంత నిజం. వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై"

నేనెందుకు రిప్లై ఇవ్వాలి. ఆదర్శం అంట ఆదర్శం. ఏదో విధంగా ఆడదాని మనసు కరిగించడానికి అబ్బాయిలు చెప్పే మంత్రాలే ఇవన్ని అని నాలో నేనే అనుకుంటూ కావ్య దగ్గరికి వెళ్లాను. ఇంతలో మళ్ళీ ఓ మెసేజ్.
"తులసి గారు మీరు ఏమి అనుకోను అంటే ఓ చిన్న రిక్వెస్ట్. నాతో పాటు లంచ్ అవర్ లో షాపింగ్ కి రాగలరా. నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి చీరలు కొనాలనుకుంటున్నా.నాకు సెలెక్ట్ చెయ్యడం రాదు. మీరు వస్తారేమో అని ? నాకెవ్వరూ తెలీదు తెలిసింది మీరొక్కరే కదా "

తులసి నువ్వు ఒక్కసారి డిసైడ్ అయితే ఇంకెవరి మాట వినవు కదా అని నాలో నేనే అనుకున్నా. ఇలా అనుకుంటే నేను ఆపని చెయ్యనని నాలో నాకే నమ్మకం. రిప్లై ఇవ్వాలి అనిపించినా ఎందుకొచ్చిన కొత్త స్నేహాలంటూ రిప్లై ఇవ్వలేదు.

నాలో నేనే మాట్లాడుకోవడం, కొంచెం uneasy గా ఉండడం, పెదాలపై పలు మార్లు ఎవరినో తిట్టుకుంటూ రుసరుసలాడడం గమనించిన కావ్య ఈరోజెందుకో కొత్తగా కనిపిస్తున్నావ్, చెప్పాలనిపించక పోయినా చెప్పాల్సిందే అంటూ కాంటీన్ కి తీసుకెళ్ళింది.

ఏంటి తులసి ఈ మధ్య మా మధ్యే ఉంటున్నావ్ కాని మాలో ఉండట్లేదు, Is something wrong? Are you ok? అని ఎప్పుడు సరదాగా అడిగినట్టే కన్ను కొడుతూ అడిగింది. అందరు నాలోని చిరునవ్వే చూస్తారు. కావ్య మాత్రం నా అంతరంగాన్ని చూస్తుంది. అందుకే కావ్య దగ్గర నేను ఏ విషయం దాయలేను. గుణరాంతో పరిచయం నుంచి ఇప్పటివరకు వచ్చిన మెసేజ్ వరకు అన్నీ చెప్పాను.

"అమ్మ దొంగా! ఇన్నాళ్ళకు మనసుకో తోడు కోసం ఆలోచించడం మొదలు పెట్టావు అన్న మాట.." అని కళ్ళేగరేస్తూ అక్కా ఎవరే అతగాడు అని ఆట పట్టించడం మొదలు పెట్టింది.

"కావ్యా! నన్ను అర్ధం చేసుకో. నీతో సరదాకి చెప్పట్లేదు. ఆయన చనిపోయిన తరువాత నేను పడిన మానసిక వ్యధకి ఇంకెవారిని నా జీవితంలోకి రానివ్వకూడదు అనుకున్న.ఇన్నాళ్ళు ఆలాగే ఉన్నా. ఇప్పుడు నేను కావాలంటు గుణరాం నాతో పరిచయాన్ని పెంచుకుంటున్నారు. నా గురించి తెలిసి దగ్గరవుతున్నారా ? నిజంగా అతనికి అంత మంచి ఆదర్శ భావాలు ఉన్నాయా అనే మానసిక సంఘర్షణలో నాలో నేను తేల్చుకోలేక ఈ కొత్త బంధాన్ని ఒప్పుకోలేక నీ సలహా అడుగుతున్నాను" అంటూ సిరియస్ గానే కావ్యతో అన్నాను.

అయ్యో తులసి, ఏదో మాటవరసకి నా ఫ్రెండ్ వి కదా అని కొంచెం ఆట పట్టించాను అంతే. నిన్ను ఏడిపించాలనీ కాదు నీ మనసు అర్ధం కాకా కాదు. నా కళ్ళల్లో తిరుగుతున్న నీళ్ళను తుడుస్తూ మళ్ళీ ఇలా చెప్పడం మొదలు పెట్టింది.

"తులసి! నీకు గుర్తుందో లేదో ఇదే విషయాన్ని నీకు గతంలో కూడా చెప్పాను. అప్పుడు నువ్వు నా మాట వినలేదు. మళ్ళీ చెబుతున్నాను విను. నీకు మూడు పదులు కూడా దాటలేదు. సమాజం కోసమో నీ రక్త బంధాల కోసమో నీ వయసుకో తోడుని మానసిక ఆనందాన్ని త్యాగం చెయ్యక్కర్లేదు. ఇంకో పది సంవత్సరాలు ఇలాగే గడిపేసావంటే నిన్ను పట్టించుకునే వారే ఉండరు. ఇప్పుడు నిన్ను కట్టుబాట్లతో కట్టడి చేసే లోకం రేపన్న రోజున నీ ఒంటరితనానికి ఓదార్పు కాదు కదా కన్నెత్తైనా చూడదు. నువ్వు నమ్ము నమ్మకపో నా భర్త తో నేను సంతోషంగా ఉన్న క్షణాలలో నాకు మొదట గుర్తొచ్చేది నువ్వే. నా స్నేహితురాలికి ఈ ఆనందం ఎందుకు లేదని. నువ్వు నీ కోసం కాదు పాప కోసం కూడా ఆలోచించు. పాపకి తండ్రిగా నీ మనసుకో తోడుగా నీ జీవితంలో ఎవ్వరైనా ఎదురొస్తే, అతను నీకు నచ్చితే అతనితో కలిసి ముందడుగు వెయ్యడానికి వెనుకాడకు. ఈరోజుల్లో అందరు రాముళ్ళే ఉండాలని ఎక్కాడా లేదు కొన్ని లోపాలున్నా మనం సర్దుకోవాలి. కళ్ళతో వేటాడే కలియుగ కీచకుల నుంచి నీకో రక్షణ కూడా దొరుకుతుంది. ఇంతే నేను చెప్పదలుచుకున్నది. ఇంకా నీ ఇష్టం. నువ్వే ఆలోచించుకో."

సూటిగా తాకుతున్నాయ్ కావ్య నన్ను అన్న మాటలు , అవును నా జీవితానికి అర్థం ఏంటి , చంపుకోలేని కోరికలను బంధనాల మధ్య చంపుకుంటూ ఎన్నాళ్ళు ,నా అంతరాత్మకి నేనే అబద్దం చెపుతున్నాను, నన్ను నేనే నాలో కనపడకుండా దాచేసు కుంటున్నాను. నేను నిజాన్నా!అసత్యంలో బ్రతికే నిజాన్నా ? ఇదే ఆలోచనలతో లంచ్ అవర్ అయ్యింది .

గుణరాం కాలింగ్ అని పదే పదే మొబైల్ మొత్తుకుంటూంది , ఆల్రెడీ ఓ గంట బయటకు వెళతాను లంచ్ అవర్ లో అని ముందుగా మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నా, కాని వెళ్ళాలని అనిపించటం లేదు. చివరి సారిగా మనసుని కట్టడి చేద్దాం ఏమవుతుందో చూద్దాం అని మొబైల్ ని బాగ్ లో ఉంచి బలవంతంగా చైర్ లోని కూర్చున్నా.

ఈవెనింగ్ 4.30 పని హడావిడిలో పడి మొబైల్ కూడా చూసుకోలేదు , ఆఫీసులో ఎప్పుడు నా మొబైల్ ని సైలెంట్ మోడ్ లో ఉంచుతా..ఎవ్వరూ నా కాల్స్ వల్ల డిస్ట్రబ్ కాకూడదని. 20 మిస్ కాల్స్ అండ్ వన్ మెసేజ్ . అయ్యో తప్పు చేసానా అని మళ్ళి ఒకసారి నాకే అనిపించింది.తానూ పంపిన సందేశాన్ని చూడకూడదు అనుకుంటూనే కళ్ళు inbox లోకి వెళ్లిపోయాయ్.

" నేను ఈ నైట్ తిరుపతి వెళుతున్నా, షాపింగ్ కి వెళ్ళలేదు మీరు రాలేదు కదా. నా చెల్లెళ్లకి తరువాత కొంటాను లెండి .. బై "

ఒక్కసారి మనసుకి బాధేసింది , అయ్యో నా వల్లే కదా తన కిష్టమైన చెల్లెళ్లకి సారీస్ కొనటం మానేసాడు. కనీసం ఓ ఫ్రెండ్ లా వెళ్లి గుణరాంకి శారీస్ సెలెక్ట్ చేసి ఇస్తే సంతోష పడేవాడేమో . ఇంకేం ఆలోచించ లేదు, కాల్ చేయడానికి కొంచం బిడియం అడ్డొచ్చింది , మెసేజ్ పంపాను . గుణరాం గారు నేను వస్తున్నాను పది నిముషాలలో cmr మాల్ దగ్గర ఉండండి.

cmr సెకండ్ ఫ్లోర్ శారీస్ వింగ్ లో తను నాకోసం వెయిట్ చేస్తున్నాడు . దూరం నుంచి నన్ను చూడటం గమనించాను . చిన్న పిల్లాడికి ఐస్ క్రీం ఇచ్చినంత ఆనందం , మురిసిపోతున్నాడు .నా గురించి నేను చెప్పుకోవడం కాదు కాని చూడగానే ఆకర్షించే నవ్వు , చక్కని కళ్ళు . చీర కట్టు కడితే నేనే కట్టాలి . బిన్నీ సిల్క్ లైట్ బ్లూ శారీకి నావీ బ్లూ జరీ అంచుతో మెరిసిపోతున్నాను .

థాంక్ యు తులసి , మీరు రారేమో అనుకున్నాను, అతని మొత్తం దృష్టంతా నా మీద వుంది . తన కళ్ళన్నీ నా చీర మీదే.

ఆడది మనసు పడితే కాని మగాడి అందం తెలీదని, మొదటి సారి తను ఎలా ఉంటాడో చూసి చూడనట్టు చూస్తునాను. చక్కటి చిరునవ్వు ,విశాలమైన నుదురు,కర్లీ హెయిర్ . అచ్చు శోబన్ బాబుకి డూప్ లా వున్నాడు. ఎక్కడ తనతో ఎక్కువ మాట్లాడితే నా మనసు తెలిసి పోతుందేమోనని పొదుపుగానే మాట్లాడి శారీస్ సెలక్షన్ చేసి ఇక వెళతాను అన్నట్టు మాల్ లోంచి బయటకి బయలుదేరాను .

తులసి ,తులసి ....తులసి గారు లోంచి తులసి లోకి మారిందేంటబ్బా పిలుపని వెనక్కి తిరిగి చూసాను, చేతిలో చిన్న బార్బీ డాల్ . మీ పాపకి ఇవ్వి అని చెప్పి ట్రైన్ కి టైం అవుతున్నట్టు హడావిడిగా వెళ్ళిపోయాడు . ఆ క్షణం కావ్య మాటలు గుర్తొచ్చాయి. హరితకి నాన్న లేని లోటు తీరాలంటే నువ్వు నీ లైఫ్ లోకి ఒకరిని ఆహ్వానించాలని తను పదే పదే అన్న మాట.

చిట్టి తల్లి ఈ డాల్ తీసుకో ఇంటికెళ్ళగానే తన చేతిలో గుణరాం ఇచ్చిన బొమ్మని ఉంచాను . రాత్రి చాలా సేపటి వరకు పడుకోలేదు దానితోనే ఆడుకుంటూ కూర్చుంది.

చూస్తూ చూస్తూ వారం రోజులు గడిచి పోయాయి. గుణరాం నుంచి ఓ కాల్ లేదు , నాకు కొంచం మొండితనం.తనే చేయకపోతే నేను ఎందుకు చెయ్యాలి అన్నట్టు నేను కాల్ ఆర్ మెసేజ్ చేయలేదు. ఆడది ఆలోచించడం మొదలు పెడితే చిన్న పాటి అసూయ కూడా మొదలవుతుందేమో, గుణరాం గురించి అలోచించడం మొదలైంది. కాల్ చేద్దామని అని పించేది, మళ్లీ నాలో నేనే అదుపు చేసుకునే దాన్ని.

"మేడం మీ గురించి ఎవరో వచ్చారు" ఆఫీసు బాయ్ వచ్చి చెప్పి వెళ్లి పోయాడు. .


బహుదూరపు బాటసారి
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment