ఇక్కడ రాసినదంతా అందరూ అనుభవించే వాస్తవమే.

ఇక్కడ రాసినదంతా అందరూ అనుభవించే వాస్తవమే. కానీ ఇందులో "నేను" అని అన్నీ నా అనుభూతులుగా వ్యక్తపరిచాను. ఇందులో నా వ్యక్తిగత విషయాలు ఏం ఉన్నాయా లేవా అని ఆలోచించకండి.. మీరూ ఇలా ఫీలవుతుంటే ఐడెంటిఫై అయితే చాలు, సంతోషం!!
_______________________
చాలా ప్రేముంది.. మాటల్లో express చెయ్యలేని ప్రేమ.. నేను ప్రేమించాను.. ప్రేమించేటప్పుడు అవతలి మనిషి కళ్లల్లోకి చూశాను.. చాలా కాజువల్ ఫీలింగ్.. మనస్సు చివుక్కుమంది...
అవతలి మనిషి సరదాగా నవ్వుతుంటే ఆ నవ్వు నాకు చాలా అడ్మైరింగ్‌గా ఉంది... కానీ అలా నవ్వుతున్నది పక్కమ్మాయితో చెప్పుకుంటున్న ఓ చీప్ జోకని అర్థమై నా మొహం చిన్నబోయింది.. అందమైన నవ్వులూ.. చూస్తే చాలు గుండె మూలల్నుండి ఆనందం తన్నుకు రప్పించే నవ్వుల వెనుక ఇంతటి చవకైన కారణాలు ఉన్నాయని తలుచుకుంటేనే ఆ నవ్వు విలువ కోల్పోతోంది.
మనిషెదురుగా కూర్చున్నాను.. మనస్సుతో మాట్లాడదామని! ఆ మనస్సు ఖాళీగా లేదు... ఏదో వెదుకులాడుతోంది నాలో.. ఆ వెదుకులాట ప్రేమ కోసం కాదని అర్థమవుతోంది... రకరకాల సంశయాలు వెదుకులాటలో తీర్చుకునే ప్రయత్నం. "ఈ మనిషితో జీవితం కంఫర్టబుల్‌గానే ఉంటుందా, ఆర్థిక భరోసా ఉంటుందా.. రిస్కేం తీసుకోవట్లేదు కదా" అనే సవాలక్ష సంశయాలు ఆ చూపుల్లో కన్పిస్తున్నాయి. ఆ చూపులు తట్టుకోలేకపోయా.. "జీవితమూ, జీవితం ఇవ్వడమూ తెలీకుండానే ప్రేమించానా.. ఆ మాత్రం జీవితంలో ప్రాణప్రదంగా చూసుకోలేననా అంత అనుమానం" - నాపై నాకు జాలితో కళ్లు దించుకున్నా.. మనస్సులో ప్రేమ మాయమైంది.. ఆ మనిషికి నేను సరిపోను అన్న భావమే మిగిలిపోయింది.
నేను ప్రేమిస్తున్నా.. "ఈ మనిషి నాకు జీవితంలో దక్కితే చాలు" అని ఎంతగా తపించిపోయానో.. ఆ మనిషిని దక్కించుకున్నా..! శరీరం పంచుకోవడమూ అయిపోయింది.. ఏమైపోయింది ఆ నిలువనీయని అద్భుతమైన ఫీలింగ్? ప్రతీ ఎక్స్‌ప్రెషన్ ఓ అద్భుతమైన మధుర స్మృతిగా అన్పించేదే.. ఆ ఆసక్తేమైపోయింది?
ఈ శరీరం కోసమా నేను ఇన్నాళ్లూ తపించింది? శరీరం ఏకమైపోయినంతలోనే ప్రేమ ఆవిరైపోవాలా? ఇదా నేను "చాలా అమితంగా ప్రేమించాను" అని గొప్పగా నాలో నేను గర్వపడిన ప్రేమ?
కొందరు ఆకర్షణ అనేస్తున్నారు.. నిజమే ఆకర్షించబడ్డాను.. అంతకన్నా కొన్ని రెట్లు ప్రేమా మనస్సులో ఉంది.. ఆ ప్రేమ ఈ మనుషులకు ఎందుకు తెలీట్లేదు? ఆ ప్రేమంతా ఏమైపోయిందో అని నేను పిచ్చిగా వెదుకులాడుతుంటే.. "నీదంతా ఆకర్షణ" అని బ్లైండ్ స్టేట్‌మెంట్లు ఇచ్చే వాళ్లని చూస్తుంటే హృదయం భగ్గుమంటోంది. శరీరం ఏకమైపోయిన వెంటనే ఆసక్తి చచ్చిపోయేవి ప్రేమలు కావని నాకు తెలుసు.. కానీ నా కారణం అది కాదు.. నన్ను ఎందుకు సరైన కారణం వెదికి సరిచేసుకోనీయరు? అసలు ప్రతీ దానికీ ఓ రెడీమేడ్ స్టేట్‌మెంట్ ఇచ్చి ఎందుకు ఇలా టార్చర్ పెడుతుంది ఈ జనాభా గుంపు?
అవసరాలూ, అవకాశాలూ, జీవితం, భద్రతా, లెక్కలూ, హోదాలూ, ఇగోలూ, కోపాలూ, ద్వేషాలూ... అన్నింటి మధ్యా నా ప్రేమ అట్టడుగుకి చేరిపోయింది. అనుక్షణం ఆ ప్రేమ ప్రేమించిన వ్యక్తి వంక ఎంత జాలిగా చూస్తోందో నా కళ్లల్లోని నిర్లిప్తతని చూస్తే అర్థమవుతుంది.. శరీరాన్ని ఆక్రమించేసుకుని కోరిక తీర్చుకోవడంలోనూ, సరదాగా బయట తిరగడంలోనూ, అవసరాలు తీర్చడంలోనూ, బాధ్యతలు నెరవేర్చడంలోనూ నా ప్రేమ ఎంత గొప్పదో డెఫినిషన్లు ఇచ్చుకుంటున్నా. అంతకన్నా కొన్ని కోట్ల రెట్ల శక్తివంతమైన ప్రేమ మాత్రం దీనంగా అడుగున పడిపోయి చూస్తూనే ఉంది. ఏ ఒంటరి క్షణంలోనో మనస్సుని దిగుల్లోకి నెట్టేస్తూ!!
ప్రేమంటే అర్థం కాని సమాజంలో, ప్రతీ దానికీ ప్రేమని అడ్డుపెట్టుకుని బ్రతికేస్తున్న సమాజంలో, ప్రేమంటే ఎవరి డెఫినిషన్లు వాళ్లు ఇచ్చేసుకుని... కొన్ని కధలూ, కవితలు రాసుకుని ప్రేమని పొంగి పొర్లించుకుంటున్న నేపధ్యంలో.. నా ప్రేమ నాకూ, ఆ భగవంతుడికీ తప్ప మూడో కంటికి తెలీనంత మిస్టీరియస్ ఎలిమెంట్‌గా మిగిలిపోయింది.
పాపం పిచ్చి జనాలు నా నవ్వుని చూసి ప్రేమ అనుకుంటున్నారు.. నా చనువుని చూసి ప్రేమ అనుకుంటున్నారు... గుండె లోతుల్లో కోహినూర్ వజ్రంలా దేదీప్యమానంగా వెలిగిపోతున్న నా అసలైన ప్రేమ అర్థమయ్యే మనిషెవ్వరు? అంతవరకూ నా ఉనికంతా ఓ నాటకమే!!
- నల్లమోతు శ్రీధర్
Sridhar Nallamothu
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment